దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతితో కొత్త మార్గం చూపించాక మెల్లగా ఇతరులు దాన్ని ఫాలో కావడం జరుగుతోంది. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ ఇలా ఒక్కొక్కరుగా యాంకర్ల అవతారం ఎత్తి పేరు, ఆదాయం రెండూ పెంచుకున్నారు. ఈ ట్రెండ్ మన దగ్గర చాలా ఆలస్యంగా మొదలయ్యిందని చెప్పాలి. ఇప్పుడిది రూపం పెంచుకుంటోంది.
చిరంజీవి, నాగార్జున, తారక్ ఎవరు మీలో కోటీశ్వరుడు చేశారు. నాని-జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ నిర్వహించాక నాగార్జున ఫుల్ టైం బాధ్యతలు తీసుకున్నారు. మంచు లక్ష్మి, సమంత, దగ్గుబాటి రానా లాంటి వాళ్ళు ఆహా లాంటి ఓటిటిలకు టాక్ షోలు చేశారు. తాజాగా ఈ లిస్టులో తేజ సజ్జ చేరుతున్నాడు. ప్రముఖ సెలబ్రిటీ షో ది ట్రైటర్స్ సౌత్ వెర్షన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. ఈ మేరకు అధికారికంగా అనౌన్స్ మెంట్ వచ్చింది. సెన్సేషనల్ గా దీన్ని డిజైన్ చేశారట.
తనొకడే కాదు కాదు కిరణ్ అబ్బవరం ఇదే ప్రైమ్ ద్వారా వెబ్ సిరీస్ ప్రపంచంలో అడుగు పెట్టాడు. డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన గువ్వలచెరువు ఘాట్ టీజర్ చూస్తే ఇంటరెస్టింగ్ అనిపించింది. త్వరలోనే వేరే సినిమాతో కిరణ్ దర్శకత్వం చేయబోతున్న సంగతి తెలిసిందే. తన కన్నా ముందు నాగ చైతన్య దూత ద్వారా వెబ్ వరల్డ్ కి పరిచయమయ్యాడు. ఇప్పుడు సీజన్ 2 ప్రణాళిక కూడా రెడీ అవుతోంది. స్క్రిప్ట్ లాకయ్యాక ప్రకటన వస్తుంది.
కేవలం బిగ్ స్క్రీన్ కి పరిమితం కావాలనే కండీషన్ పెట్టుకోకుండా యూత్ హీరోలు ఇలా కొత్త దారులు పట్టుకోవడం ద్వారా తెలివైన ఎత్తుగడ వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పటి కృష్ణ, చిరంజీవి లాగా ఏడాదికి పదికి పైగా సినిమాలు విడుదల చేసే సీన్ లేదిప్పుడు. కెరీర్ మొత్తం మహా అయితే యాభై సినిమాలు చేస్తే అదే గొప్ప ఘనతనుకోవాలి. కానీ ఆ అవకాశం కొద్దిమందికే ఉంది. సో ఇలా ఆప్షన్లు పెంచుకుంటూ మార్కెట్ విస్తరించుకోవడం హీరోలకు ఇన్కమ్, ఇమేజ్ రెండు తెచ్చి పెడుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
