మోక్షం కోసం జననాయకుడి ఎదురుచూపులు

సంక్రాంతికి విడుదల కావాల్సిన జన నాయకుడు సెన్సార్ వివాదం వల్ల వాయిదా పడ్డాక ఎన్నో అడ్డంకులు, కోర్టు హియరింగులు ఫేస్ చేసింది. ఫైనల్ గా అభ్యంతరం వచ్చిన భాగాలను తీసేయడానికి నిర్మాత ఒప్పుకున్నాడనే వార్త చెన్నై వర్గాల్లో చక్కర్లు కొట్టినా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటిదాకా రాలేదు. ఇంకోవైపు జన నాయకుడు నిర్మాణ సంస్థ కెవిఎన్ తీసిన మరో ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్ వాయిదా పడటం గాయం మీద కారం చల్లినట్టు అయ్యింది.

దీనికి తోడు విజయ్ విడాకుల వ్యవహారంతో పాటు తాజాగా త్రిషతో కలిసి తను వేడుకలకు వెళ్లడం తమిళనాడు సినీ రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదంతా చూసి విజయ్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అసలు జన నాయకుడు రిలీజ్ ఉంటుందా లేదానే మీమాంసలో ఉండగా ఇప్పుడీ త్రిష వ్యవహారం వాళ్ళకో తలనెప్పిగా మారి యాంటీ ఫ్యాన్స్ కు అవకాశం ఇచ్చింది.

ఏది ఎలా ఉన్నా తమిళనాడు ఎన్నికల ముందే జన నాయకుడు విడుదల కావాలనేది అభిమానుల కోరిక. ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ కు అది ఉపయోగపడుతుందని వాళ్ళ ఫీలింగ్. ఒకవేళ ఎలెక్షన్ రిజల్ట్ తేడా కొట్టి తర్వాత సినిమా వస్తే భారీ స్పందన ఉంటుందో లేదోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ మాత్రం ఇకపై జన నాయకుడు వ్యవహారం తనకు సంబంధం లేదన్నట్టే ఉన్నారు.

అసలే భగవంత్ కేసరి రీమేక్ గా రూపొందిన జన నాయకుడులో సెన్సార్ అంతగా అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన అంశాలు ఏమున్నాయో అనే దాని మీద మూవీ లవర్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

వినోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా ఒరిజినల్ వెర్షన్ లో శ్రీలీల పోషించిన పాత్రను తమిళంలో మమిత బైజు చేసింది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చగా ఆడియో కూడా ఆశించిన స్థాయిలో మేజిక్ చేయలేదనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. జన నాయకుడు ఎప్పుడు రిలీజ్ చేసినా పోటీ లేని సోలో టైం చూసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఆ ముహూర్తం ఎప్పుడో.