ఆరు రోజుల్లో అంచనాలు పెంచేయాలి  

కేవలం ఆరు రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. ఇప్పటిదాకా ఉన్న బజ్ చూసుకుంటే కెజిఎఫ్, పుష్పలాంటి బ్లాక్ బస్టర్స్ ని మ్యాచ్ చేయడం లేదన్నది వాస్తవం. ట్రైలర్ లో బోల్డ్ కంటెంట్ తగ్గించి యాక్షన్ విజువల్స్ ఎక్కువగా పెట్టడం సానుకూలంగా పని చేసినప్పటికీ, సామాన్య ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి కలిగించడంలో కొంత తడబడింది. అయితే స్టోరీ రివీల్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్లే అలా అనిపించి ఉండొచ్చని, అసలు ఎక్స్ పీరియన్స్ వేరే ఉంటుందని టీమ్ అంటోంది.

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చివరి దశ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇంకా ప్రమోషన్లకు అందుబాటులో రావడం లేదు. నయనతార గురించి తెలిసిందే. ఈవెంట్ అయితే వచ్చింది కానీ ఇంటర్వ్యూలు లాంటివి ఆశించడం కష్టం. రుక్మిణి వసంత్, తారా సుతారియా డేట్స్ సమస్య వల్ల రేపో ఎల్లుండో కెమెరాల ముందుకు వస్తారట. కియారా అద్వానీ తన పాత్ర గురించి ఎగ్జైటింగ్ గా చెబుతోంది కానీ సోషల్ మీడియా దాటి బయటికి వస్తేనే మరింత ప్రయోజనం కలుగుతుంది.

ఈ లెక్కన బరువు మొత్తం యష్ భుజాల మీద ఉంది. తెలుగు వరకు చూసుకుంటే టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే వార్తల నేపథ్యంలో సోషల్ మీడియా నెగటివిటీ ఎక్కువగా కనిపిస్తోంది. దీన్ని దాటడం టీమ్ కు పెద్ద సవాలే. డబ్బింగ్ మూవీకి హైక్స్ తెచ్చుకోవడం కొత్త కాకపోయినా టాక్సిక్ విషయంలో మాత్రం జనం నుంచి సానుకూలత కనిపించడం లేదు. రెగ్యులర్ మాస్ ఆడియన్స్ సైతం టాక్సిక్ కంటెంట్ పట్ల ఒకరకమైన కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

ఓపెనింగ్స్ వరకు ఇబ్బంది లేదు. అయితే మొదటి రోజే వంద కోట్లు దాటాలన్నా, రికార్డులు బద్దలు కొట్టాలన్నా టాక్సిక్ లో ఎక్స్ ట్రాడినరి అనిపించే విషయాలు చాలా ఉన్నాయనే అభిప్రాయం జనంలో కలగాలి. లేదూ ప్రీమియర్ షోల టాక్ యునానిమస్ గా కెజిఎఫ్ రేంజ్ లో రావాలి. ఎల్లుండి హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో జరగబోయే వేడుకలో యష్ తో పాటు ఎవరెవరు వస్తారో ఏమేం విశేషాలు పంచుకుంటారో వేచి చూడాలి. ఇది సక్సెస్ కావడం కూడా కీలకమే.