వచ్చే వారం మార్చి 13 విడుదల కావాల్సిన బ్యాండ్ మేళం ఇరవై రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 3కి వెళ్లిపోయింది. మొన్నటిదాకా జోరుగా ప్రమోషన్లు చేసిన టీమ్ హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. పోస్ట్ పోన్ అనుకునే మౌనం వహించినట్టు ఉన్నారు. అయితే అదే రోజు శర్వానంద్ బైకర్, సంగీత్ శోభన్ రాకాసలు ఉన్నాయి. కంటెంట్ పరంగా చూసుకుంటే ఆ రెండు పెద్ద స్కేల్ తో రూపొందాయి. జానర్లు కూడా వేరే. బ్యాండ్ మేళం అలా కాదు.. గతంలో చూసిందే.
ఒక టీనేజ్ అమ్మాయి అబ్బాయి మధ్య రూపొందిన విలేజ్ లవ్ స్టోరీ. పూర్తి వినోదాత్మకంగా తీశారు. నిర్మాత కోన వెంకట్ దగ్గరుండి పబ్లిసిటీ వ్యవహారాలు గట్రా చూసుకుంటున్నారు. నిర్ణయం మార్చుకోవడానికి గల కారణాలు వేరే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ చాలా అంటే చాలా డ్రైగా ఉంది. జనాలు థియేటర్లకు రావడం లేదు. చాలా సినిమాలకు బయట పోస్టర్లు ఉంటున్నాయి కానీ లోపల షోలు పడటం లేదు.
పట్టుమని పదిమంది కూడా రాకపోతే ఎగ్జిబిటర్లు మాత్రం ఏం చేయగలరు. కపుల్ ఫ్రెండ్లీ లాంటి డీసెంట్ టాక్ వచ్చినవి కూడా ఏ సెంటర్లలోనే వసూళ్లు తెచ్చాయి. ఇవి కాసేపు పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ పిల్లలు పరీక్షల మూడ్ లో ఉన్నారు. బ్యాండ్ మేళంకు మద్దతు ఇవ్వాల్సింది వాళ్ళే. ఇప్పుడు అదే పనిగా చదువులు పక్కన పెట్టి వచ్చే సీన్ లేదు. అందుకే టీమ్ వెనుకడుగు వేసి ఉండొచ్చు.
పైగా మార్చి 19 దురంధర్ 2 రివెంజ్, టాక్సిక్ సునామిలాగా ముంచుకొస్తున్నాయి. బ్యాండ్ మేళంకు మంచి టాక్ వచ్చినా థియేటర్లను నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. ఉన్నది కేవలం వారం గ్యాపే. ఆడియన్స్ వాటి కోసం ఎదురు చూసే మూడ్ లో వేరేవాటిని పట్టించుకోవడం లేదు.
ఏది ఏమైనా థియేటర్ల దగ్గర పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేరళ స్టోరీ 2 లాంటి హిందీ సినిమాలు ఏమైనా ఆక్సీజెన్ ఇస్తాయేమో అనుకుంటే అది కూడా జరగడం లేదు. మృత్యుంజయ్ నుంచి ఈ నిర్లిప్తతలో మార్పు రావాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. మరి బైకర్, రాకాసతో ఢీ కొట్టడం బాగానే ఉంది కానీ ఇది రిస్కో కాదో ఏప్రిల్ 3 కంటెంట్ చూశాక అర్థమవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates