చిరు నడుం సైజెంత?

సినిమాలు విడిచిపెట్టి రాజకీయాల వైపు వెళ్లిపోయాక చిరు అవతారంలో చాలా మార్పు వచ్చింది. ఫిజిక్ గురించి, లుక్స్ గురించి ఆయన ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయింది. కానీ మళ్లీ సినిమాల్లోకి రావాలి అనుకోగానే ఆయన అవతారం మారిపోయింది. సన్నబడ్డారు. లుక్ మార్చుకున్నారు. ఇక అప్పట్నుంచి జాగ్రత్తగా ఫిజిక్, లుక్ మెయింటైన్ చేస్తున్నారు మెగాస్టార్.

ఐతే ‘సైరా’ సినిమా చేసేటపుడు ఆయన లుక్ కొంచెం తేడా కొడుతున్నట్లు అనిపించింది. కానీ ‘ఆచార్య’ కోసం మళ్లీ సన్నబడ్డారు. ఆకర్షణీయమైన లుక్‌లోకి మారారు. ఐతే కరోనా విరామం వల్ల షూటింగ్ ఆగిపోయాక చిరు మళ్లీ కొంచెం లావై కనిపించారు. కానీ ఈ మధ్య వర్కవుట్లవీ చేసి మళ్లీ నాజూగ్గా తయారయ్యారు. తాజాగా ‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలెకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరు.. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత సన్నబడి కనిపించి ఆశ్చర్యపరిచారు.

ఈ సందర్భంగా చిరు, నాగార్జునల మధ్య జరిగిన సరదా సంభాషణ, చమక్కులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉన్నట్లుండి ‘బిగ్ బాస్’ వ్యవహారం పక్కన పెట్టి చిరు చుట్టూ తిరిగి ఆశ్చర్యపోతూ చూసిన నాగ్.. ‘‘చిరంజీవి గారూ.. వేస్ట్ సైజ్ ఎంత’’ అని అడిగారు. దానికి సమాధానం తన భార్య సురేఖను అడగాలని చెప్పి తప్పించుకున్నారు. ఇంత నాజూగ్గా తయారయ్యారు ఎలా అని అడిగితే.. లాక్ డౌన్ ఎవరికి ఎలా ఉపయోగపడిందో, ఎవరిని ఎంతగా ఇబ్బంది పెట్టిందో కానీ.. తనకు మాత్రం మంచే చేసిందని.. రోజుకు రెండుసార్లు వర్కవుట్లు చేసి బాగా బరువు తగ్గానని చిరు చెప్పాడు.

నాగ్ నడుం సైజు గురించి గుచ్చి గుచ్చి అడగ్గా.. గ్యాలరీలో ఉన్న బిగ్ బాస్ కంటెస్టంట్లే గెస్ చేయాలని అన్నాడు చిరు. ఒకరు 30 అని.. ఇంకొకరు 32 అని.. మరొకరు 33 అని అనగా.. చివరగా చెప్పిన నంబర్‌కు హాఫ్ ఇంచ్ ఎక్కువ అని చెప్పడం ద్వారా.. తన నడుం సైజు 33.5 అంగుళాలని ఖరారు చేశాడు చిరు. ఈ సందర్భంగా తన నడుం సైజు 33 అని నాగ్ వెల్లడించాడు.