సీఎం సినిమా తడబడుతుంది

అసలే తెలుగు నుంచి తమిళంలోకి రీమేక్ అయిన సినిమా. పైగా విడుదల చాలా ఆలస్యం అయింది. మధ్యలో సినిమా ఆన్ లైన్లో లీక్ అయింది. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు రిలీజ్ రోజు బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. ఇంకేముంది.. ‘జననాయకుడు’ తెలుగు రాష్ట్రాల్లో కనీస ప్రభావం కూడా చూపించలేకపోతున్నాడు. చాలా ఏళ్ల నుంచి విజయ్ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న మాస్టర్, లియో చిత్రాలకు కూడా బంపర్ కలెక్షన్లు వచ్చాయి. ‘గోట్’ కూడా పర్వాలేదనిపించింది.

‘జననాయకుడు’కు కూడా తొలి రోజు వరకు ఓపెనింగ్స్‌కు ఢోకా లేదు. రూ.4 కోట్లకు దగ్గరగా గ్రాస్ వచ్చింది గురువారం. కానీ రిలీజ్ రోజు టాక్, రివ్యూలు మరీ బ్యాడ్‌గా ఉండడం.. తర్వాతి రోజు ‘చెన్నై లవ్ స్టోరీ’ రిలీజై పర్వాలేదనే టాక్ తెచ్చుకోవడంతో విజయ్ సినిమాపై గట్టి ప్రభావమే పడింది. రెండో రోజు తెలుగులో ఈ చిత్రానికి గ్రాస్ కోటిన్నరకు మించలేదు. ఇది చాలా నామమాత్రమైన నంబరే.

ఒక్కసారిగా బాగా డ్రాప్ అయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘జననాయకుడు’ బుకింగ్స్ నామమాత్రంగా ఉన్నాయి. శని, ఆదివారాల్లో ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరే కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు సీఎం సినిమాకు బోలెడన్ని థియేటర్లు ఇచ్చినా.. ఆక్యుపెన్సీలు లేవు. వీకెండ్లో కూడా సినిమా పెద్దగా ప్రభావం చూపేలా కనిపించడం లేదు.

తమిళంలో కూడా ‘జననాయగన్’ పరిస్థితి ఆశాజనకంగా లేదు. తొలి రోజుతో పోలిస్తే ఈ చిత్ర వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. తొలి రోజుతో పోలిస్తే ఓవరాల్‌గా ‘జననాయగన్’ కలెక్సన్లు 50 శాతం డ్రాప్ అయ్యాయి. ఇండియాలో తొలి రోజు రూ.43 కోట్ల దాకా నెట్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.23 కోట్లతో సరిపెట్టుకుంది. వరల్డ్ వైడ్ ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.115 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ రూ.60 కోట్లకు అటు ఇటుగా ఉండొచ్చు.

రూ.400 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించగా.. రిలీజ్ లేటవడం, పైరసీ వెర్షన్ లీక్ వల్ల నిర్మాత మీద విపరీతంగా భారం పడింది. చివరికి చూస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపట్లేదు. దీంతో బయ్యర్లకు, నిర్మాతకు భారీ నష్టాలు తప్పేలా లేవు.