ఎన్నిసార్లు చెప్పాలి.. సీనియ‌ర్ న‌టి అస‌హ‌నం

90వ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కథానాయిక.. మీనా. ఇటు తెలుగులో, అటు తమిళంలో ఆమె అప్పటి టాప్ స్టార్లందరితోనూ సినిమాలు చేశారు. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. కెరీర్లో బిజీగా ఉండగానే ఆమె విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు. వీరికి ఓ అమ్మాయి పుట్టింది. తన పేరు.. నైనిక. తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘తెరి’లో ఆ పాప కీలక పాత్ర పోషించింది.

ఐతే నాలుగేళ్ల కిందట మీనా కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయారు. ఐతే భర్త చనిపోయిన కొన్ని రోజులకే తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రావడం ప‌ట్ల మీనా అప్ప‌ట్లో చాలా బాధ ప‌డింది. కానీ ఈ రూమ‌ర్లు ఎంత‌కీ ఆగ‌ట్లేదు. భ‌ర్త చ‌నిపోయిన నాలుగేళ్ల త‌ర్వాత కూడా మీనా సింగిల్‌గానే కొన‌సాగుతుండ‌గా.. ఆమె రెండో పెళ్లి గురించి మాత్రం వార్త‌లు ఆగ‌ట్లేదు. ఈ విష‌యంలో మీనా తాజాగా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌న రెండో పెళ్లి గురించి ప‌దే ప‌దే ఎందుకు పుకార్లు పుట్టిస్తున్నారంటూ ఆమె ప్ర‌శ్నించారు. తాను లైమ్ లైట్లో ఉన్న మ‌హిళ‌ను కావ‌డంతో ఇలా అదే ప‌నిగా వార్త‌లు పుట్టిస్తూ ఉంటారా అన్నారు. ఈ వార్త‌లు త‌నను ఎంతో బాధిస్తున్నాయ‌ని, త‌న ప‌ట్ల అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మీనా పేర్కొన్నారు.

త‌న‌కు ఒక కూతురు ఉన్న విష‌యం మ‌రిచిపోతున్నార‌ని.. త‌ను ఆన్ లైన్లో ఈ వార్త‌లు చూస్తుంద‌ని.. త‌న‌తో పాటు త‌న కుటుంబం మీద మాన‌సికంగా ఈ వార్త‌లు ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతాయ‌ని మీనా అన్నారు.

తాము ఏదైనా ప్ర‌చారం చేసి ప‌బ్బం గ‌డుపుకోవ‌చ్చ‌ని కొంద‌రు అనుకుంటార‌ని.. కానీ ఇలాంటి వారిని క‌ర్మ విడిచిపెట్ట‌దంటూ మీనా త‌న అస‌హ‌నాన్ని, ఆవేద‌న‌ను బ‌య‌ట‌పెట్టారు. మీనా ఇన్నిసార్లు చెబుతున్నా త‌న రెండో పెళ్లి గురించి వార్త‌లు పుట్టిస్తున్న వాళ్లు ఆమె ఆవేద‌న‌ను అర్థం చేసుకుని ఇక‌నైనా నెమ్మ‌దిస్తారేమో చూడాలి. మీనా కీల‌క పాత్ర పోషించిన క్రేజీ సీక్వెల్ దృశ్యం-3 ఏప్రిల్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.