తాను ఆషామాషీగా ఏ సినిమా హిట్ అని చెప్పనని.. అలా చెప్పాను అంటే అది హిట్టయి తీరుతుందని అంటున్నాడు సీనియర్ నటుడు నరేష్. ఆయన సంక్రాంతికి రిలీజైన ‘నారీ నారీ నడుమ మురారి’ పెద్ద హిట్టవుతుందని చెప్పారు. అంతకుముందు ‘సామజవరగమన’ చిత్రానికి కూడా తాను ఇలాగే చెప్పానన్నారు. ఇప్పుడు ‘హే భగవాన్’ సైతం కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇది ప్రమోషన్ల కోసం చెబుతున్న మాట కాదని.. సినిమా రిలీజయ్యాక తన మాటతో అందరూ ఏకీభవిస్తారని పవిత్రతో కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూలో నరేష్ చెప్పారు.
‘‘నేను రాజకీయాలను, సినిమాలను బాగా విశ్లేషిస్తాను. నేను గతంలో చెప్పినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య ‘కేర్యాంప్’ సినిమా హిట్టవుతుందని చెబితే చాలామంది నమ్మలేదు. హిట్టయింది కదా. తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’కి చెప్పాను. అది రిలీజవుతున్నపుడు హైప్ లేదు. అది హిట్టవుతుందని అన్నాను. సంక్రాంతి విన్నర్ అయింది. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా మనస్ఫూర్తిగా. ప్రమోషన్ల కోసం చెబుతున్నది కాదు.
హే భగవాన్ తెలుగులో ఒక కొత్త తరహాలో తీసిన సినిమా. ఫ్యామిలీకి నచ్చే ఫన్ ఉన్న సినిమా. యూత్‌కు కూడా నచ్చుతుంది. నా కెరీర్లో కూడా మైలురాయిగా నిలుస్తుంది. నా కెరీర్లోనే ఈ సినిమాలోది బెస్ట్ క్లైమాక్స్ అవుతుంది. ఫిలిం క్రిటిక్స్ సైతం మెచ్చే సినిమా ఇది. నా పాత్రను దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రేక్షకులు ఆ పాత్రను చూసి ఆశ్చర్యపోతారు. కొత్త కథకు వినోదాన్ని జోడించిన తీరు హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నరేష్ తెలిపారు.
గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ‘హే భగవాన్’లో సుహాస్, శివాని నాగారం హీరో హీరోయిన్లుగా నటించారు. వచ్చే శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates