నయనతారకిది ఊహించని అవమానమే

దీపావళి పండగ సందర్భంగా వంద కోట్ల బొమ్మగా ప్రచారం చేసుకుని విడుదలైన మూకుతి అమ్మన్ 2 (మహాశక్తి) దారుణంగా బోల్తా కొట్టి డిజాస్టర్ వైపు పరుగు పెడుతున్న వైనం కలెక్షన్లలో కనిపిస్తోంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ డ్రామాలో వీరసింహారెడ్డి ఫేమ్ దునియా విజయ్, రెజీనా కసెండ్రా విలన్లుగా నటించారు. పబ్లిసిటీ వగైరాలు బాగానే చేశారు. నయన్ స్వయంగా గుళ్లకు వెళ్లి మహిళలకు చీరలు పంచిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ తిరిగాయి. అయినా లాభం లేకపోయింది.

కరోనా టైంలో డైరెక్ట్ ఓటిటి మూవీగా రిలీజైన మూకుతి అమ్మన్ కు డిజిటల్ లో మంచి రెస్పాన్స్ దక్కింది. అమ్మోరు తల్లి పేరుతో మనోళ్లు కూడా బాగానే చూశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ స్టార్ హీరో సూర్య కళ్ళలో పడింది దీంతోనే. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వీరభద్రుడు చేయడం, అది పెద్ద హిట్ కావడం వేరే విషయం. సీక్వెల్ తాను చేయలేనని తప్పుకోవడం వల్లే బాలాజీ స్థానంలో సుందర్ వచ్చి చేరారు. ఓపెనింగ్ మొదలుపెట్టి రిలీజ్ డేట్ వరకు నిర్మాణ సంస్థ భారీ పబ్లిసిటీ చేసింది.

ఇంతా చేసి వీకెండ్ అయ్యాక పట్టుమని పది కోట్ల కలెక్షన్ కూడా రాకపోవడంతో ట్రేడ్ వర్గాలు బేర్ మంటున్నాయి. పటాసుల పండగ కాబట్టి యావరేజ్ ఉన్నా చాలు జనం ఎగబడి వస్తారని అంచనా వేసిన బయ్యర్ల లెక్కలు రివర్స్ అయ్యాయి. రామాయణ, సీన్ ఓవర్ ఫ్లోస్ కూడా మహాశక్తికి ఉపయోగపడటం లేదంటే నయన్ ఇమేజ్ ఏ మాత్రం పని చేయలేదని అర్థం చేసుకోవచ్చు. అమ్మోరు, లేడీ జర్నలిస్ట్ గా డ్యూయల్ రోల్ చేసినా పనవ్వలేదు. స్వంత ఫ్యాన్సే ఇదేం సినిమా బాబోయ్ అంటున్నారు.

ఏఐని ఇష్టం వచ్చినట్టు వాడి దాన్నే విఎఫ్ఎక్స్ అనుకోమంటే జనం అంత అమాయకులు కారు. ఈజీగా గుర్తు పట్టేస్తున్నారు. కంటెంట్ కొత్తగా లేకపోతే దారుణమైన టాక్ ఇస్తున్నారు. దర్శకులు తమను తాము మార్చుకోకుండా ఇంకా పాతికేళ్ళు వెనకే ఉంటామంటే ఇలా పదే పదే తిరస్కారాలు ఎదురు చూడాల్సి ఉంటుంది. లేడీ సూపర్ స్టార్ గా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయన్ కి ఇది ముమ్మాటికీ అవమానకర ఫలితమే. ఓటిటిలో వచ్చాక ట్రోలింగ్ పీక్స్ లో ఉంటుందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.