కొత్త హీరో నటించిన సినిమా అంటే జనాల్లో అంత సులభంగా అటెన్షన్ రాదు. ప్రమోషన్లు బలంగా చేసినా ఏదో ఒక స్టార్ అట్రాక్షన్ లేనిదే ప్రేక్షకులు ఇటు వైపు చూడరు. ఇట్లు అర్జున ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. డెబ్యూ హీరో అనీష్ రెడ్డి నటించిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ లో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం సమకూర్చడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నుంచి అక్కినేని నాగార్జున సమర్పకుడిగా వ్యవహరించడం అసలు ట్విస్ట్.
ఇక్కడితో అయిపోలేదు. కుర్రాడికి టాప్ సెలబ్రిటీస్ అండదండలు దక్కుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ని హీరో కలిసిన వీడియో బైట్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నాడు. పెద్ది తర్వాత బయట పబ్లిక్ వేడుకలో చరణ్ కనిపించనున్నది దీంట్లోనే. ఒక ప్రముఖ స్టార్ తో వాయిస్ ఓవర్ చెప్పించడం స్పెషల్ బోనస్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. ఇలా బోలెడు ఆకర్షణలున్నాయి.
వెంకీ కుడుముల నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్న ఇట్లు అర్జునలో హీరో పాత్రకు మాటలు ఉండవు. మూగవాడు. రకరకాల మలుపులతో దర్శకుడు మహేష్ ఉప్పల దీన్ని స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా తీర్చిదిద్దారట. ఆదర్శ కుటుంబం ఏకె 47 కోసం అక్టోబర్ నెలలో మూడు డేట్లు త్యాగం చేసిన ఇట్లు అర్జున ఫైనల్ గా నవంబర్ 13 లాక్ చేసుకుంది. ఇంకో తొమ్మిది సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ ఈసారి వెనుకడుగు వేసే ఉద్దేశంలో అయితే లేదు. అందుకే పబ్లిసిటీ ఉదృతం చేస్తున్నారు.
ఇంత బ్యాకప్ ఉండటం మంచిదే కానీ ఓపెనింగ్స్ కి ఇది ఎంత వరకు దోహదపడుతుందో చూడాలి. చరణ్ వస్తున్నాడంటే మెగా ఫ్యాన్స్ అటెన్షన్ అయితే వస్తుంది. తారక్ చెప్పాడు కాబట్టి తన అభిమానులు కూడా ఒక లుక్ వేయొచ్చు. టాక్ పాజిటివ్ వస్తే చాలు మిగిలింది ఆడియన్స్ చూసుకుంటారు. కాకపోతే రామాయణ, సీన్ చాలా స్ట్రాంగ్ గా నిలబడిన నేపథ్యంలో ఇంత కాంపిటీషన్ మధ్య ఇట్లు అర్జున ఎలా నెగ్గుకు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయినా కంటెంట్ ఉంటే ఇదేం టెన్షన్ పడే మ్యాటర్ కాదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates