టాలీవుడ్ హీరోలు ‘సీన్’ చేసి ఉంటే

సూర్య కొత్త సినిమా ‘సీన్’ వసూళ్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రివ్యూలు మరీ గొప్పగా రాలేదు. పబ్లిక్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ కాలేదు. ఉన్నంతలో విభిన్న ప్రయత్నమనే పేరు వచ్చింది కానీ గజిని రేంజ్ లో అందరూ మాట్లాడుకునేలా కాదు. విమర్శకుల విశ్లేషణలు ఎలా ఉన్నా జెన్ జీ కుర్రకారుకు దర్శకుడు జీతూ మాధవన్ స్క్రీన్ ప్లే, కథ చెప్పిన విధానం నచ్చేసింది. ల్యాగ్, హెచ్చుతగ్గులు, లాజిక్స్ మిస్ కావడం లాంటి మైనస్సులు ఉన్నా ఇది చూడొచ్చనే రికమండేషన్ లో పెట్టేశారు.

ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒకవేళ టాలీవుడ్ హీరోలు సీన్ లాంటివి చేస్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని. ఇక్కడ కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి. తెలుగులో స్టార్ల మీద ప్రత్యేకంగా కొన్ని అభిప్రాయాలు, అంచనాలు, మార్కెట్ క్యాలికులేషన్లు ఉంటాయి. వాటిని మీరి ఏదైనా ప్రయోగం చేస్తే కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయే రిస్క్ ఉంది. అందుకే మనోళ్లు క్రైమ్ థ్రిల్లర్లకు దూరంగా ఉంటారు. ఆ మధ్య శ్రీవిష్ణు మృత్యుంజయ్ తో ట్రై చేశాడు కానీ పనవ్వలేదు. ఇది కూడా సీన్ లాగే మైండ్ గేమ్ కాన్సెప్టే.

సీన్ ఒక డబ్బింగ్ మూవీ. అక్కడ బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టినా తెలుగు హక్కులను రీజనబుల్ రేట్లకు అమ్మారు. కాబట్టి బ్రేక్ ఈవెన్, లాభాలు వేగంగా కనిపిస్తాయి. ఒకవేళ ఇదే సీన్ ఏ నానినో విజయ్ దేవరకొండనో చేస్తే లెక్కలు మారిపోతాయి. బిజినెస్ మూడు నాలుగింతలు పెరుగుతుంది. హిట్ 3 ది థర్డ్ కేస్ విషయంలో ఇదే జరిగింది. సినిమా యావరేజ్ కన్నా పైనే ఉన్నా కమర్షియల్ గా గట్టెక్కడంలో ఎక్కువ టైం పట్టింది. అనువాద చిత్రాలకు ఇలాంటి రిస్కులు ఉండవు.

ఎప్పటికైనా తమిళ తెలుగు మలయాళ ఆడియన్స్ మధ్య అభిరుచుల పరంగా వ్యత్యాసాలు, ఇమేజ్ పరంగా విభిన్నమైన పోలికలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి తప్ప చిరంజీవి జైలర్ చేయలేదు, నాని సీన్ ఎంచుకోలేదు అంటూ గగ్గోలు పెట్టి లాభం లేదు. ఒరిజినల్ వెర్షన్ లో మూడు వందల కోట్లు వసూలు చేసిన బెత్లహం కుటుంబ యూనిట్ మన దగ్గర తెచ్చిన నెంబర్లు చాలా తక్కువ. కాబట్టి ఊరికే పొరుగిళ్లని పొగుడుకోకుండా వాస్తవాలు గుర్తిస్తే ఎవరికీ ఇబ్బంది లేదు.