కొన్ని నెలల క్రితం నెగటివిటీని మోసుకుని టీజర్ ట్రైలర్ టైంలో విమర్శలను చవి చూసిన రామాయణ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. దీపావళిని పండగని పూర్తిగా క్యాష్ చేసుకుంటూ వసూళ్ల టపాసులు పేలుస్తూ సగర్వంగా 500 కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు పెట్టేసింది. అటు ఓవర్సీస్ లోనూ దుమ్ము రేపుతున్న ఈ ఎపిక్ డ్రామా కేవలం హిందీలోనే కాకుండా తెలుగు తమిళ కన్నడ భాషల్లోనూ దూకుడుగా వెళ్తోంది. ఒక్క మలయాళంలో మాత్రమే కొంచెం నెమ్మదిగా ఉంది.
3డి వెర్షన్ టికెట్ల అమ్మకాలు మహా జోరుగా ఉన్నాయి. నిన్న ప్రధాన నగరాలు, కేంద్రాలు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు చేశాయి. ఏపీ తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు లేకుండా దిల్ రాజు రిలీజ్ చేయడంతో ఆక్యుపెన్సీలు చాలా బాగున్నాయి. ఒక్కసారి ఈ విజువల్ గ్రాండియర్ చూడాలన్న జనాల ఆకాంక్ష కలెక్షన్లుగా మారుతోంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన రామాయణకి ఇంకో రెండు వారాలు అడ్డుకట్ట వేయడం కష్టమనేలా ఉంది.
పిల్లలను, జెన్ జీ యువతని మెప్పించడంలో దర్శకుడు నితేశ్ తివారి చూపించిన పనితనం మంచి ఫలితం ఇస్తోంది. విఎఫ్ఎక్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ, చేసిన రిపేర్లు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. చూస్తుంటే వెయ్యి కోట్ల మార్కు దాటేయడం చాలా సులభంగా కనిపిస్తోంది. అయితే పుష్ప 2, దురంధర్ ని దాటడం గురించి అప్పుడే ట్రేడ్ వర్గాలు ఎలాంటి నిర్ధారణకు రాలేకపోతున్నాయి. ఇదే జోరు నవంబర్ మొత్తం కొనసాగితే సాధ్యమంటున్నారు.
రామాయణ పార్ట్ 1 కొచ్చిన రెస్పాన్స్ ఖచ్చితంగా సీక్వెల్ మీద అంచనాలు పెంచేదే. రెండు సంవత్సరాల తర్వాత వచ్చే పార్ట్ 2 షూటింగ్ ఇంకొంత కీలక భాగం పెండింగ్ ఉందని సమాచారం. సరిపడా సమయం ఉంది కాబట్టి మరింత బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు టీమ్ త్వరలోనే పనులు ప్రారంభించబోతోందట. హనుమాన్ ఎంట్రీ, లంకా దహనం, సంజీవిని, రామసేతు నిర్మాణం, రామ రావణ యుద్ధం మొదలైన ఎపిసోడ్స్ అన్నీ అందులోనే ఉండబోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates