ఆ సినిమా నుంచి ఆమిర్ ఔట్

త‌మిళంలో గ‌త ద‌శాబ్ద కాలంలో వ‌చ్చిన ఉత్త‌మ చిత్రాల్లో విక్ర‌మ్ వేద ఒక‌టి. భార్యాభ‌ర్త‌లైన పుష్క‌ర్-గాయ‌త్రి ఉమ్మ‌డిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ నియో నాయిర్ థ్రిల్ల‌ర్.. అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంది. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌.. ఉత్కంఠ భ‌రిత స్క్రీన్ ప్లేతో ఈ సినిమా క్రిటిక్స్‌ను కూడా మెప్పించింది.

ఈ సినిమా రీమేక్ కోసం వివిధ భాష‌ల నుంచి ప్ర‌య‌త్నాలు జరిగిన‌ట్లు వార్త‌లొచ్చాయి. తెలుగులో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ దాని సంగ‌తి ఎటూ తేల‌లేదు. ఐతే హిందీలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నీర‌జ్ పాండే.. విక్ర‌మ్ వేద రీమేక్ హ‌క్కులు సొంతం చేసుకున్నాడు. ఒరిజిన‌ల్లో మాధ‌వ‌న్ చేసిన పోలీస్ పాత్ర‌కు సైఫ్ అలీ ఖాన్‌ను ఎంచుకున్నాడు. ఐతే ఈ సినిమాలో మేజ‌ర్ హైలైట్ అయిన విజ‌య్ సేతుప‌తి పాత్ర సంగ‌తే ఎటూ తేల‌కుండా ఉంది.

ఈ ఏడాది ఆరంభంలో ఆమిర్ ఖాన్ సేతుపతి చేసిన గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌కు ఖ‌రారైన‌ట్లు వార్త‌లొచ్చాయి. మార్చిలో షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని.. లాల్ సింగ్ చ‌ద్దాతో పాటే ఆమిర్ ఈ సినిమాలో కూడా న‌టిస్తాడ‌ని అన్నారు. కానీ ఇంత‌లో క‌రోనా వ‌చ్చింది. అన్ని సినిమాల్లాగే దీనికీ బ్రేక్ ప‌డింది. లాక్ డౌన్ త‌ర్వాత ఆమిర్ లాల్ సింగ్ చ‌ద్దా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నాడు.

త్వ‌ర‌లో అది పూర్తి చేసి విక్ర‌మ్ వేద రీమేక్‌లో న‌టిస్తాడ‌ని అనుకుంటే.. ఇప్పుడేమో అత‌నీ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది. స్క్రిప్టు న‌చ్చ‌క త‌ప్పుకున్నాడా.. పాత్ర సూట‌వ‌ద‌నుకున్నాడా.. డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోయాడా.. కార‌ణ‌మేంటో కానీ ఆమిర్ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డం మేక‌ర్స్‌కు రుచించ‌నిదే. మాతృక‌ను కూడా ఒరిజిన‌ల్ తీసిన పుష్క‌ర్, గాయ‌త్రినే డైరెక్ట్ చేయ‌బోతున్నారు. మ‌రి ఆమిర్ స్థానంలోకి ఎవ‌రిని తెస్తారో చూడాలి.