దిల్ రాజు రేంజ్ ఇది

టాలీవుడ్లో నిన్నట్నుంచి ఒకటే చర్చ.. అది దిల్ రాజు పుట్టిన రోజు వేడుకల గురించే. ఈ రోజు ఆయన 50వ జన్మదినం. ఈ సందర్భంగా ముందు రోజు రాత్రే టాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేక విందు ఇచ్చారు రాజు. టాలీవుడ్లో ఇప్పటిదాకా అత్యంత గ్రాండ్‌గా జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో ఇదొకటిగా చెబుతున్నారు. ఈ వేడుకలకు హాజరైన అతిథుల జాబితా చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎవరైనా ప్రముఖుల కుటుంబాల్లో పెళ్లిళ్లు జరిగినా కూడా ఇంత మంది ప్రముఖులు హాజరు కారు.

గత కొన్నేళ్లలో పరిశీలిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కుటుంబంలో జరిగే వేడుకలు కూడా చాలా వాటిని స్కిప్ చేశారు. ఆయనకంత తీరిక ఉండదు. అలాంటిది పవన్.. ఒక పుట్టిన రోజు వేడుకకు వచ్చారంటే ఆశ్చర్యపోవాల్సిందే. మొన్న నిహారిక పెళ్లి వేడుకకు కూడా చాలా సాదాసీదా డ్రెస్సులో వెళ్లిపోయిన పవన్.. దిల్ రాజు బర్త్ డే సెలబ్రేషన్స్‌కు మాత్రం సూటు బూటు వేసుకుని భలేగా తయారై వెళ్లాడు. పవన్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్’ చేస్తుండొచ్చు. అంత మాత్రాన తన నిర్మాత పుట్టిన రోజు వేడుకలకు కచ్చితంగా హాజరు కావాల్సిన స్థితిలో ఏమీ పవన్ లేడు. అయినా వెళ్లాడంటే అది దిల్ రాజు మహిమే.

ఇప్పటిదాకా రాజుతో సినిమా చేయని మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ వేడుకలకు హాజరయ్యాడు. అలాగే ‘బాహుబలి’తో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ అయిపోయిన ప్రభాస్, ఇంకా ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న రామ్ చరణ్ సహా టాలీవుడ్ బడా స్టార్లు చాలామందే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 50వ పడిలో పడ్డప్పటికీ.. రాజు మునుపెన్నడూ లేని విధంగా ఒక కుర్రాడిలో సూటేసుకుని సరికొత్త లుక్‌లో దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పుట్టిన రోజు వేడుకల విషయంలో రాజు ఎప్పుడూ ఇంత హడావుడి చేసింది లేదు. ఇదంతా ఈ మధ్యే పెళ్లి చేసుకున్న ప్రభావం కావచ్చు. తన భార్యను ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు మరికొన్ని కారణాలతో రాజు తన పుట్టిన రోజు వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది.