గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం దర్శకుడు గుణశేఖర్. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో ప్రమోషన్ల భారం మొత్తం తన భుజాల మీద వేసుకున్నారు. గత చిత్రం శాకుంతలం ప్యాన్ ఇండియా స్థాయిలో డిజాస్టర్ కావడంతో ఈసారి ఆశలన్నీ యూఫోరియా మీద పెట్టుకున్నారు.

అయితే తన కమర్షియల్ పరిమితులు దాటి ఒక సీరియస్ ఇష్యూని తీసుకుని జెన్ జీకి అర్థమయ్యేలా చేసిన ప్రయత్నం మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కాన్సెప్ట్ అవసరమైనదే అయినప్పటికీ మీటర్ దాటి చెప్పడం మిక్స్డ్ టాక్ వచ్చేలా చేసింది.

మాదకద్రవ్యాల వాడకం, యువత చేస్తున్న దారుణమైన తప్పులు, తల్లి తండ్రుల బాధ్యత, కుర్రాళ్ళ నేరాలు ఇవన్నీ రెండున్నర గంటల్లో ఒక మెసేజ్ ఇచ్చేలా ట్రై చేసిన గుణశేఖర్ కు క్రిటిక్స్ నుంచి కొంత  ప్రశంస దక్కుతోంది కానీ సెకండాఫ్ హ్యాండిల్ చేసిన విధానం మీద సానుకూల స్పందన లేదు.

ఇలాంటి జానర్స్ తో కుటుంబ ప్రేక్షకులను మెప్పించలేం. టార్గెట్ యూత్ అనుకుంటే ఇంత పెయిన్ ఫుల్ నెరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడదు. అలాంటప్పుడు గుణశేఖర్ ఎవరిని లక్ష్యంగా పెట్టుకున్నారనేది అంతు చిక్కని ప్రశ్న. సోషల్ మీడియాలో ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ గురించి కాంప్లిమెంట్స్ బాగానే వస్తున్నాయి.

మొత్తంగా చెప్పాలంటే యూఫోరియా గుణశేఖర్ కు కంబ్యాక్ మూవీ కావడం గురించి అనుమానాలైతే ఉన్నాయి. బాక్సాఫీస్ స్టేటస్ తేలాలంటే ఇంకో మూడు నాలుగు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది కానీ నిన్న ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

బిసి సెంటర్లలో జనం పెద్దగా కనిపించలేదని ట్రేడ్ టాక్. హైదరాబాద్ లాంటి నగరాల్లో కొంత మేర ఆక్యుపెన్సీలు ఉన్నా పట్టణాలు, గ్రామాల్లో టైటిల్, కాన్సెప్ట్ రెండూ సరిగా రిజిస్టర్ కాలేదని బుకింగ్స్ చూసి చెప్పొచ్చు. కాంపిటీషన్ ఎంత ఉన్నా అటెన్షన్ తెచ్చుకోవడంలో ఎంతోకొంత సక్సెసైన గుణశేఖర్ నమ్మకం పూర్తి స్థాయిలో గెలిచిందా అంటే సమాధానం ఔనని చెప్పడం కష్టం.