పెళ్లిపై మెగా కుర్రాళ్ల దోబూచులాట‌

టాలీవుడ్లో వ‌రుస‌బెట్టి పెళ్లిళ్లు అయిపోతున్నాయి. మెగా ఫ్యామిలీలో కూడా బ్యాచిల‌ర్లు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లు ఎక్కేయాల్సిన స‌మ‌యం వ‌చ్చేసిన‌ట్లే ఉంది. ఇటీవ‌లే అమ్మాయిలంద‌రిలోకి చిన్న‌దైన నిహారిక పెళ్ల‌యిపోయింది. నిహారిక అన్న వ‌రుణ్‌కు కూడా త్వ‌ర‌లోనే పెళ్లి చేసే సూచ‌న‌లున్న‌ట్లు నాగ‌బాబు ఇప్ప‌టికే సంకేతాలిచ్చాడు.

ఇక ఆ ఫ్యామిలీ త‌ర్వాతి పెళ్లిళ్ల విష‌యానికొస్తే సాయిధ‌ర‌మ్ తేజ్, అల్లు శిరీష్ క‌నిపిస్తారు. వీరిలో తేజునే ఒక ఏడాది పెద్ద‌వాడు. 34 ఏళ్ల ఈ మెగాస్టార్ మేన‌ల్లుడు కూడా 2021లో పెళ్లి కొడుకు అవుతాడ‌నే ప్ర‌చారం ఈ మ‌ధ్య న‌డుస్తోంది. కానీ తేజు మాత్రం త‌న‌కు అలాంటి ఆలోచ‌నే లేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తేల్చేశాడు. ఇంకో ఐదేళ్లు త‌న‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేద‌న్నాడు.

త‌న సంగ‌తి చెప్పి ఊరుకోకుండా త‌న కంటే ముందు త‌న క‌జిన్ అల్లు శిరీష్ పెళ్లి చేసుకునే అవ‌కాశాలున్నాయ‌ని వ్యాఖ్యానించి ఆస‌క్తి రేకెత్తించాడు. తేజు ఇలా అన్నాడంటే శిరీష్ నిజంగానే పెళ్లికి రెడీ అవుతున్నాడేమో అనుకున్నారు జ‌నాలు. ఐతే తేజు కామెంట్ల‌కు సంబంధించిన వార్త‌పై శిరీష్ స‌ర‌దాగా స్పందించాడు. తేజు జోక్ చేస్తున్నాడ‌ని.. అత‌డి మాట‌ల్ని ఎవ్వ‌రూ సీరియ‌స్‌గా తీసుకోర‌నే ఆశిస్తున్నాన‌ని శిరీష్ అన్నాడు.

ప్ర‌స్తుతం తాను బ్యాచిల‌ర్‌గా కొన‌సాగ‌డంపై త‌న త‌ల్లిదండ్రులు సంతోషంగా ఉన్నార‌ని.. త‌న‌కు పెళ్లి చేసుకోవాల‌ని అనిపించిన‌పుడు క‌చ్చితంగా త‌నే ముందు ఆ విష‌యాన్ని చెబుతాన‌ని శిరీష్ అన్నాడు. దీనిపై త‌ర్వాత తేజు ఏమీ స్పందించ‌లేదు. ఐతే కొత్త ఏడాదిలో అయితే మెగా ఫ్యామిలీలో మ‌ళ్లీ పెళ్లి బాజాలు మోగ‌డ‌మైతే ఖాయ‌మ‌నే సంకేతాలే వ‌స్తున్నాయి. వ‌రుణ్ పెళ్లి వ‌చ్చే ఏడాదే చేసేస్తామ‌ని నాగ‌బాబు ఇంత‌కుముందే అన్న సంగ‌తి తెలిసిందే.