అనుదీప్ దగ్గర ఆటోకు డబ్బులు లేకుంటే…

‘జాతిరత్నాలు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు అనుదీప్. అందులో అతను పండించిన కొత్త రకం కామెడీకి ఈ తరం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. తెర మీదే కాదు.. బయట ఏ ఈవెంట్‌కు వచ్చినా.. లేదా ఏదైనా టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నా.. లేదా ఇంటర్వ్యూలో పాల్గొన్నా అనుదీప్ పంచే ఎంటర్టైన్మెంటే వేరుగా ఉంటుంది.

తన కొత్త సినిమా ‘ఫంకీ’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకప్పటి తన రూం మేట్, ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో విజయాలందుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో కలిసి ఒక చిట్ చాట్ లాంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అనుదీప్. ఇద్దరూ కలిసి ఒకప్పటి తమ అనుభవాలకు సంబంధించి అనేక ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఒక సందర్భంలో ఆటోకు సరిపడా డబ్బులు లేకుంటే అనుదీప్ ఏం చేశాడో వెల్లడించాడు కళ్యాణ్. నా గురించి నీకు గుర్తున్న సంఘటన చెప్పమంటే.. మనమంతా కలిసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పెళ్లికి వెళ్లిన విషయం చెబుతా అంటూ దాని గురించి గుర్తు చేసుకున్నాడు కళ్యాణ్.

అనుదీప్, కళ్యాణ్, అండ్ గ్యాంగ్ ఆటోలో పెళ్లికి వెళ్లారట. ఐతే ఆటో ఛార్జి రూ.180 కాగా.. వీళ్ల దగ్గర రూ.140 మాత్రమే ఉన్నాయట. ఆటో దిగాక ఆ మొత్తం ఇచ్చి, డబ్బులు తగ్గినందుకు.. తమతో కలిసి వచ్చి లోపల భోజనం చేయమన్నాడట అనుదీప్. ఖద్దూకా ఖీర్ సహా మంచి మంచి స్వీట్స్ ఉంటాయని ఊరించి ఆటో డ్రైవర్‌ను లోపలికి తీసుకెళ్లాడట అనుదీప్.

ఇది చూసి ఇతను విజనరీ.. ఎక్కడా ఆగడు, ఏం అనుకుంటే అది సాధిస్తాడు.. ఎంతదూరమైనా వెళ్లిపోతాడు అనుకున్నానంటూ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు కళ్యాణ్ శంకర్. విశ్వక్సేన్, కాయదు లోహర్ జంటగా అనుదీప్ రూపొందించిన ‘ఫంకీ’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.