ప్రమోషన్లు హద్దు మీరితే…

ఈ రోజుల్లో చిన్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిలో పడడం.. వాళ్లు థియేటర్లు రావడం కష్టమైపోయింది. అందుకోసం ప్రమోషన్లను విభిన్న రీతిలో నిర్వహిస్తూ.. తమ సినిమాల గురించి జనాలు మాట్లాడుకునేలా చేయాలని రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ ప్రయత్నం హద్దులు దాటిపోతే ఏమవుతుందో చెప్పడానికి ‘బరాబర్ ప్రేమిస్తా’ కథానాయకుడు, సోషల్ మీడియాలో ‘యాటిట్యూడ్ స్టార్’గా పేరు తెచ్చుకున్న చంద్రహాస్ చేసిన పనే నిదర్శనం.

‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అతను ‘గుంజి గుంజి…’ అంటూ ఒక పాట పాడాడు. సినిమాలో ఉన్న పాటకు సొంతంగా తాను కొన్ని బూతులు జోడించి.. స్టేజ్ మీద పాట పాడడం.. దానికి ఆడిటోరియంలో ఉన్న అతిథులు చప్పట్లు కొట్టడం వివాదాస్పదమైంది. ఈ పాటను చాలామంది సోషల్ మీడియాలో తప్పుబట్టారు. చంద్రహాస్‌తో పాటు చప్పట్లు కొట్టి అతిథులకు కూడా అక్షింతలు పడ్డాయి.

ఈ పాటను తీవ్రంగా తప్పుబడుతూ అశోక్ వేములపల్లి అనే జర్నలిస్టు వీడియో పెట్టగా.. దాని మీద చంద్రహాస్ ఇంకో వీడియో పోస్ట్ చేశాడు. ఇప్పుడు సినిమాల్లో వస్తున్న బూతులతో పోలిస్తే, తనను ఇన్నిరోజులుగా జనాలు తిట్టిన తిట్లతో పోలిస్తే తాను వాడిన బూతులు ఒక లెక్కా అంటూ ఎదురుదాడి చేశాడు.

తనతో పాటు తన తల్లిదండ్రులను తిట్టినందుకు ఆ జర్నలిస్టే సారీ చెప్పాలంటూ అతడికి 24 గంటల గడువు పెట్టాడు. లాయర్లతో మాట్లాడుతున్నా, నీ మీదే కేసులు పెడతా అని కూడా వార్నింగ్ ఇచ్చాడు చంద్రహాస్. ఐతే ఈలోపే.. అశోక్ పెట్టిన వీడియో మీద తెలంగాణ పోలీసులు స్పందించారు. దీనిపై చర్యలు చేపడతామన్నారు. 

ఆ జర్నలిస్టు కూడా ఆలస్యం చేయకుండా ఈ పాట పాడడమే కాక, తనను బెదిరించిన చంద్రహాస్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. మొత్తానికి ‘గుంజి గుంజి’ పాటతో, ఆ తర్వాతి పరిణామాలతో సినిమాకు ఏమేర ప్రయోజనం చేకూరుతుందో కానీ.. చంద్రహాస్ మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవడమే కాక.. పోలీసు కేసులు కూడా ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రమోషన్ల విషయంలో మరీ హద్దులు దాటకుండా చూసుకుంటే మంచిది.