‘వర్షం’ లాంటి బ్లాక్ బస్టర్ తీసి మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శోభన్.. ఆ తర్వాత కొన్నేళ్లకే అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోయాడు. ఆయన పెద్ద కొడుకే యువ కథానాయకుడు సంతోష్ శోభన్. తండ్రికి ఇండస్ట్రీలో ఉన్న మంచి పరిచయాల దృష్ట్యా అతడికి టీనేజీలోనే సినిమాల్లో అవకాశం వచ్చింది. అలా అని తన టాలెంట్‌ను తక్కువ చేయడానికేమీ లేదు. తొలి సినిమా ‘గోల్కొండ హైస్కూల్’లోనే తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశాడు.
మొదట్లో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ ‘ఏక్ మిని కథ’తో బ్రేక్ వచ్చింది. కానీ ఆ విజయాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు.. ఇలా వరుసగా ఫ్లాపులు వచ్చాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘అన్నీ మంచి శకునములే’ బ్రేక్ ఇస్తుందనుకుంటే అదీ ఫెయిలైంది.
నటుడిగా ప్రతిసారీ మంచి మార్కులే పడుతున్నా.. విజయం దక్కక రేసులో బాగా వెనుకబడిపోయాడు సంతోష్. ఇప్పుడతను ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో.. కెరీర్లో గ్యాప్ తీసుకోవడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సంతోష్. వరుసగా పరాజయాలు వస్తున్నపుడు ఇలా గ్యాప్ తీసుకుని జాగ్రత్తగా సినిమా చేయాల్సిన అవసరముందని అతను అభిప్రాయపడ్డాడు.
మామూలుగా అయితే ఇలా గ్యాప్ తీసుకునే లగ్జరీ తనకు లేదని.. కానీ తన తమ్ముడు సంగీత్ శోభన్ తనకు ఆ లగ్జరీ ఇచ్చాడని సంతోష్ వ్యాఖ్యానించడం విశేషం. సంగీత్ డబ్బులు సంపాదించడం వల్ల తాను గ్యాప్ తీసుకుని.. జాగ్రత్తగా కొత్త సినిమాను ఎంచుకునే అవకాశం లభించిందన్నాడు.
చాలామంది గుర్తించని విషయం ఏంటంటే.. సంతోష్ నటుడిగా పరిచయం అయిన ‘గోల్కొండ హైస్కూల్’లోనే సంగీత్ కూడా చిన్న పాత్ర చేశాడు. ఆ తర్వాత అతను గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతను సినిమాల్లో కనిపించలేదు.
సంతోష్ లీడ్ రోల్ చేసిన ‘బేకర్ అండ్ బ్యూటీ’లో తమ్ముడి పాత్రతో సంగీత్ రీఎంట్రీ ఇచ్చాడు. సంతోష్‌ను మించి అతడికి పేరొచ్చింది. తర్వాత ‘మ్యాడ్’ సినిమా చేస్తే అది పెద్ద హిట్టయింది. ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా బాగా ఆడడంతో అతను బిజీ అయిపోయాడు.
త్వరలోనే ‘రాకాస’ సినిమాతో రాబోతున్నాడు సంగీత్. అన్న కంటే లేటుగా వచ్చి అన్నను మించి పేరు సంపాదించి, తనకంటే బిజీ అయిపోయాడు సంగీత్. ఈ క్రమంలో అన్నకు కూడా అండగా నిలిచి.. తనో మంచి సినిమా సెట్ చేసుకోవడానికి ఛాన్సిచ్చాడు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ హిట్టయి సంతోష్‌కు కూడా బ్రేక్ వస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates