పుష్ప ఈజ్ బ్యాక్

అల్లు అర్జున్, సుకుమార్‌ల కలయికలో మూడో సినిమా ఖరారై దాదాపు రెండేళ్లు అవుతోంది. కానీ ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది నెల కిందటే. ఈ ఆలస్యానికి ఎన్నెన్నో కారణాలున్నాయి. అన్ని అడ్డంకులనూ అధిగమించి గత నెల తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ మొదలుపెట్టారు. భారీ సెటప్, ఖర్చుతో లాంగ్ షెడ్యూలే ప్లాన్ చేసుకుంది చిత్ర బృందం. అనుకున్న ప్రకారమే చిత్రీకరణ సాగించారు కానీ.. మధ్యలో కరోనా వచ్చి చిత్ర బృందాన్ని షేక్ చేసేసింది.

సినిమా యూనిట్లో పదుల సంఖ్యలో కరోనా బాధితులు తేలడంతో అప్పటికప్పుడు చిత్రీకరణ ఆపేసి హైదరాబాద్‌కు వచ్చేయాల్సి వచ్చింది. దీంతో గ్యాప్ అనివార్యమైంది. ఐతే మళ్లీ ఇప్పుడే మారేడుమిల్లికి తిరిగెళ్లే పరిస్థితి లేక.. మధ్యలో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు.

తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప’ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని కాచిగూడలో మొదలైంది. అక్కడ ఓ పాత కళ్యాణమండపాన్ని అద్దెకు తీసుకుని చిత్రీకరణ సాగిస్తున్నారట. ఈ సినిమా 25-30 ఏళ్ల ముందు నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం. అప్పటి వాతావరణానికి తగ్గట్లుగా సెటప్ చేసుకుని షూటింగ్ చేస్తున్నారు. కొన్ని రోజులు ఇక్కడ చిత్రీకరణ జరిపాక హైదరాబాద్ శివార్లలో మరికొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారట. ఈ షెడ్యూల్ అయిపోయాక కొంత గ్యాప్ తీసుకుని తర్వాత మారేడుమిల్లికి వెళ్లనున్నారట.

ఈసారి ఏమాత్రం తేడా రాకుండా ప్లాన్ చేసుకుని తక్కువమంది కాస్ట్ అండ్ క్రూతో అక్కడికి వెళ్తారట. విరామం లేకుండా షూటింగ్ జరిపితే సగం పైగా సినిమా పూర్తయిపోతుందని సమాచారం. ఇప్పటికే చాలా సమయం వృథా అయిన నేపథ్యంలో సుక్కు తన గత సినిమాలతో పోలిస్తే చాలా వేగంగా, తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేయాలనే ప్రణాళికలతో ఉన్నారట.