ఓం కార్ అన్నియా వచ్చేస్తున్నాడా?

తెలుగు టీవీ చ‌రిత్ర‌లోనే ట్రెండ్ సెట్టింగ్ షోల్లో ఆట ఒక‌టి. అప్ప‌టికే వేరే ఛానెళ్ల‌లో కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములు ఉన్న‌ప్ప‌టికీ. జీ తెలుగులో వ‌చ్చిన ఈ డ్యాన్స్ షో సంచ‌ల‌నం రేపింది. చాలా ఏళ్ల పాటు అల‌రించిన ఈ షోకు మ‌ధ్య‌లో బ్రేక్ పడింది. ఓవైపు ఈటీవీలో ఢీ షో నిరాటంకంగా సాగిపోతుండ‌గా.. ఆట మాత్రం ఆగిపోవ‌డం దాని అభిమానుల‌కు నిరాశ క‌లిగించింది.

ఐతే కొన్నేళ్ల విరామం త‌ర్వాత ఆట షోను మ‌ళ్లీ జీ తెలుగులో పునఃప్రారంభిస్తుండ‌డం విశేషం. ఈ వీకెండ్లోనే ఈ షో కొత్త సీజ‌న్ ఆరంభం కాబోతోంది. మ‌రి ఒక‌ప్పుడు ఈ షోను న‌డిపించిన యాంక‌ర్ ఓంకారే మ‌ళ్లీ దీన్ని హోస్ట్ చేయ‌బోతున్నాడా.. వేరే యాంక‌ర్లు తెర‌పైకి వ‌స్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది. ముందు కంటే గ్రాండ్‌గా ఈ షోను ర‌న్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. కొత్త కాన్సెప్ట్‌లు ప్ర‌వేశ‌పెడతార‌ట‌.

యాంక‌ర్ ఓంకార్ త‌న ఓక్ ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ‌లో ప్రొడ్యూస్ చేసిన ఈ షో అప్ప‌ట్లో భారీ టీఆర్పీలు తెచ్చుకుంది. సుంద‌రం మాస్ట‌ర్ శివశంక‌ర్ మాస్ట‌ర్ లాంటి లెజెండ‌రీ డ్యాన్స్ మాస్ట‌ర్లు న్యాయ నిర్ణేత‌లుగా ఈ షోల‌కు ఎంతో ఆక‌ర్ష‌ణ తీసుకొచ్చారు. ఓంకార్ త‌ర్వాతి కాలంలో ఇంకెన్నో షోలు చేయ‌డానికి, ఏకంగా ద‌ర్శ‌కుడిగా మారి రాజు గారి గది లాంటి హిట్ సినిమాలు తీయ‌డానికి పునాది వేసింది ఈ షోనే.

ఈ షోల ద్వారా ఎంతోమంది డ్యాన్స‌ర్ల‌కు పేరొచ్చింది. సినీ అవ‌కాశాలు కూడా ద‌క్కాయి. సంక్రాంతి సినిమా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారులో హుక్ స్టెప్‌తో గొప్ప పేరు సంపాదించిన సందీప్ సైతం ఈ షో నుంచి వ‌చ్చిన‌వాడే. ఆట అన్న‌ది అత‌డి ఇంటి పేరుగా కూడా మారిపోయింది. కొత్త సీజ‌న్లో టీవీ సెల‌బ్రెటీ సుడిగాలి సుధీర్ సంద‌డి చేస్తాడ‌ని తెలుస్తోంది. అత‌డి రోల్ ఏంట‌న్న‌ది తెలియ‌దు. మ‌రి మ‌ళ్లీ ఆట ఒక‌ప్ప‌టిలా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.