జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే ముందు చివ‌ర‌గా న‌టించిన చిత్రం.. జ‌న‌నాయ‌గ‌న్. తెలుగు హిట్ మూవీ భ‌గ‌వంత్ కేస‌రికి రీమేక్‌గా తెర‌కెక్కిన‌ప్ప‌టికీ… విజ‌య్ పొలిటిక‌ల్ జ‌ర్నీకి ఉప‌యోగ‌ప‌డేలా ఇందులో రాజ‌కీయ అంశాల‌ను బాగానే ద‌ట్టించారు.

ఈ సినిమాతో త‌న అభిమానుల‌ను మురిపించ‌డ‌మే కాక‌.. త‌న రాజ‌కీయ భావ‌జాలాన్ని జ‌నాల‌కు కాస్త ఎక్కించాల‌ని బాగానే ప్లాన్ చేసుకున్నాడు విజ‌య్. అంతా అనుకున్న ప్ర‌కారం జ‌రిగితే.. ఎన్నిక‌ల‌కు మూణ్నాలుగు నెల‌ల ముందు ఈ సినిమా త‌మిళనాడును ఒక ఊపు ఊపేసి ఉండాలి. కానీ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా కాస్తా.. సెన్సార్ స‌మ‌స్య‌ల‌తో అనూహ్యంగా వాయిదా ప‌డిపోయింది.

కొన్ని రోజుల త‌ర్వాత అయినా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని.. సినిమా రిలీజ‌వుతుంద‌ని ఆశించారు ఫ్యాన్స్. కానీ స‌మ‌స్య ఎంత‌కీ తెగ‌ట్లేదు. ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే.. ఎన్నిక‌ల లోపు జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ‌య్యే సంకేతాలు క‌నిపించ‌డం లేదు.

ఇప్ప‌టిదాకా విజ‌య్.. నిర్మాత‌లకు మ‌ద్ద‌తుగా నిలుస్తూ సినిమాను బ‌య‌టికి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చాడు. కానీ ఎక్క‌డా ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడం గురించి, దీనికి దారి తీసిన కార‌ణాల గురించి అత‌ను మాట్లాడ‌లేదు. ఐతే తాజాగా విజ‌య్ ఒక ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన పొలిటిక‌ల్ ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా సంగ‌తి ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది.

త‌న సినిమా రిలీజ్ ఆగిపోవ‌డానికి రాజ‌కీయాలేకార‌ణమ‌న్న‌ట్లుగా విజ‌య్ అనుమానం వ్య‌క్తం చేశాడు. అలాగే జ‌న‌నాయ‌గ‌న్ నిర్మాత‌ నిర్మాత కె.నారాయ‌ణ విష‌యంలో అత‌ను ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

నా నిర్మాత‌ల గురించి నాకు బాధ‌గా ఉంది. నేను రాజ‌కీయాల్లోకి రావ‌డం వ‌ల్లే ఈ సినిమాకు ఇలా జ‌రుగుతోంది. నా కార‌ణంగా నిర్మాత‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. రాజ‌కీయ రంగంలోకి అడుగు పెట్ట‌క‌ముందే వీటికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సినిమాపై ప్ర‌భావం పడుతుంద‌ని ముందే ఊహించాను అని విజ‌య్ వ్యాఖ్యానించాడు. ఐతే జ‌న‌నాయ‌గ‌న్ వెనుక ఎవ‌రు కుట్ర చేశారు.. ఆ సినిమా ఎప్పుడు రిలీజ‌వుతుంది అనే విష‌యాల‌పై విజ‌య్ ఏమీ మాట్లాడ‌లేదు.