చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఆ సమయానికి సినిమా రెడీ అవ్వదేమో అన్న సందేహాలే నిజమయ్యాయి. షూట్ ఆలస్యం అయింది. సినిమా వాయిదా పడింది. 

మార్చిలో సినిమా రాదని కొన్ని వారాల ముందే ఒక స్పష్టత వచ్చేసింది. కొత్త డేట్ ఏదనే విషయంలో తర్జన భర్జనలు నడుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మే 1న రిలీజ్ డేట్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. మేలో ఏదో ఒక డేట్ అని ప్రచారం జరుగుతూ వచ్చింది కానీ.. ఒకటవ తేదీకే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు.

ఐతే మే 1కి ఆల్రెడీ ఒక ఇంట్రెస్టింగ్ మూవీ షెడ్యూల్ అయి ఉంది. అక్కినేని అఖిల్ కొత్త చిత్రం ‘లెనిన్’ను మే 1న రిలీజ్ చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. అఖిల్‌కు ఈ సినిమా ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఓ మోస్తరు ఫలితాన్నందుకున్న అక్కినేని కుర్ర హీరోకు ‘ఏజెంట్’ పెద్ద షాకిచ్చింది.

ఆ తర్వాత అతను ఎలాంటి సినిమా చేయాలనే తలనొప్పిని ఎదుర్కొన్నాడు. అఖిల్‌తో పాటు నాగ్ ఎంతో ఆలోచించి చివరికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు మురళీకృష్ణతో సినిమాను ఓకే చేశారు. 

రిలీజ్ డేట్ విషయంలో కూడా ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు చరణ్ సినిమా పోటీకి వస్తోంది. ఐతే చరణ్, అఖిల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇద్దరూ మాట్లాడుకున్నాకే తమ చిత్రాల రిలీజ్ డేట్లు ఖాయం చేసుకుంటారనడంలో సందేహం లేదు. ‘పెద్ది’ మే 1న రాక తప్పని పరిస్థితి ఉంటే.. అఖిల్ అదే నెలలో ఇంకో డేట్ చూసుకుంటాడేమో.