గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ వచ్చే వరకు గత ఏడాదికి ఇదే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంత పెద్ద హిట్ సినిమాలో కథానాయికగా చేసిన ఐశ్వర్య రాజేష్‌కు.. ఆ తర్వాత తెలుగులో ఆశించిన అవకాశాలు మాత్రం రాలేదు.
వెంకీకి జోడీగా ఆమె కీలక పాత్రలో చాలా బాగా నటించింది. అందం, అభినయం రెంటితోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంది. వెంకీ పక్కన బాగా సూటైన నేపథ్యంలో.. సీనియర్ హీరోల సరసన అయినా ఆమెకు ఛాన్సులు వస్తాయనుకున్నారు. కానీ అలా జరగలేదు. చాలా గ్యాప్ తర్వాత ఐశ్వర్య.. యువ నటుడు తిరువీర్ సరసన ‘ఓ సుకుమారి’ అనే చిన్న సినిమాలో నటిస్తోందంతే.
‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వరుసగా తనకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయని.. పెద్ద హీరోల సరసన నటిస్తానని ఆశించినట్లు ఐశ్వర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అలా జరగకపోవడం కొంత నిరాశ కలిగించినప్పటికీ.. తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తూ సంతోషంగానే ఉన్నానని ఐశ్వర్య చెప్పింది.
హీరోయిన్‌గా ఐశ్వర్య చేయగలదా.. అని తెలుగు దర్శకులు, హీరోలు, నిర్మాతలు అనుకుంటున్నారేమో అని ఆమె కామెంట్ చేసింది. అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోయినా.. తన వద్దకు వచ్చిన కథా బలమున్న సినిమాలు, పాత్రలతో ఆనందంగా ఉన్నట్లు ఆమె చెప్పింది.
తాను కెరీర్ ఆరంభంలో, 21 ఏళ్లకే ‘కాకాముట్టై’ చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించానని.. కాబట్టి ఎలాంటి రోల్ చేయడానికైనా తాను సిద్ధంగా ఉంటానని ఆమె స్పష్టం చేసింది. ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య అచ్చమైన తెలుగమ్మాయే.
ఐతే తండ్రి ఉండగా కుటుంబంతో కలిసి చెన్నైలో సెటిలైన ఐశ్వర్య.. ఆయన మరణానంతరం కూడా అక్కడే ఉండిపోయింది. తమిళ సినిమాల ద్వారానే నటిగా పరిచయం అయి.. ఆ తర్వాత తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి, రిపబ్లిక్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రాల్లో నటించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates