త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి పాత్రలు పడ్డాయి. పెర్ఫామెన్సులూ అదిరిపోతాయి. కానీ ఈషా రెబ్బాకు మాత్రం త్రివిక్రమ్ అన్యాయం చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఆమె సెకండ్ హీరోయిన్ అయి ఉంటుందని ఆశిస్తే.. పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రను ఇచ్చాడు త్రివిక్రమ్.
ఈషాకు పెర్ఫామ్ చేసే స్కోపే లేకపోయింది. ఈ పాత్ర విషయంలో ఇంతకుముందే ఈషా అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా తన కొత్త సినిమా ఓం శాంతి శాంతి శాంతిః ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. అరవింద సమేత రిలీజ్ తర్వాత తన పాత్ర విషయంలో వచ్చిన స్పందన చూసి బాధ పడ్డట్లు వెల్లడించింది ఈషా.
త్రివిక్రమ్ సినిమాలు, వాటిలోని డైలాగ్స్ అంటే తనకు ఇష్టమని..అరవింద సమేత కథ చెప్పినపుడు అందులో కచ్చితంగా నటించాలని అనుకున్నానని ఈషా వెల్లడించింది. ఐతే మొదట్లో తనది కూడా లీడ్ రోల్స్‌లో ఒకటి అనే చెప్పారని ఆమె తెలిపింది. తన పాత్ర స్టీరియో టైప్ అవుతుందా అన్న భయం ఉన్నప్పటికీ.. రోజులు గడిచేకొద్దీ ఆ భయం పోయిందని చెప్పింది. అరవింద సమేత మేకింగ్ టైంలో.. అది పెద్ద సినిమా, పెద్ద దర్శకుడు, పెద్ద నిర్మాణ సంస్థ కావడంతో అందరూ తన గురించి మాట్లాడుకునేవారని.. అసలు తాను ఆ సినిమాలో ఉన్నానన్నది నిజమా కాదా అని న్యూస్‌లు ఇచ్చేవారని ఆమె గుర్తు చేసుకుంది.
ఐతే సినిమా రిలీజ్ తర్వాత చాలామంది ఫోన్ చేసి.. అనవసరంగా ఈ పాత్ర చేశారు, ఏముంది ఇందులో అనడంతో తాను చాలా బాధ పడ్డానని ఈషా చెప్పింది. నాకు క్యారెక్టర్లు చేయడానికి ఇబ్బంది లేదని.. కానీ అవి చేస్తూ పోతే, హీరోయిన్‌గా తనను అంగీకరించరేమో అని.. లీడ్ రోల్స్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈషా తెలిపింది. మలయాళ హిట్ జయ జయ జయ జయహేకు రీమేక్‌గా తెరకెక్కిన ఓం శాంతి శాంతి శాంతిఃలో ఈషాకు జోడీగా తరుణ్ భాస్కర్ నటించాడు. సజీవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates