దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ రిలీజైనపుడు ఆశించినంత స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. మూడో సినిమా ‘కీడా కోలా’ ఓ మాదిరిగా ఆడింది. ఐతే దర్శకుడిగా ఎక్కువ సినిమాలు చేయకపోయినా.. మరోవైపు నటుడిగా మెప్పిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు తరుణ్ భాస్కర్.
ఇప్పుడు అతను తొలిసారిగా లీడ్ రోల్ చేసిన ‘ఓం శాంతి శాంతి శాంతి:’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ హిట్ ‘జయ జయ జయ జయహే’కు రీమేక్ అయినప్పటికీ.. ఈ చిత్రానికి తెలుగులో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్.. తన కొడుక్కి శుభాకాంక్షలు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
‘‘ఒరేయ్ తరుణ్ భాస్కర్.. ఆల్ ద బెస్ట్. చేసినావు అయిపోయింది. రోల్‌లో ఉండిపోకురా ప్లీజ్. నా పెంపకం దెబ్బ తింటది. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని ఆమె సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ చిత్రంలో హీరోది భార్య మీద జులుం చూపించే పాత్ర. పదే పదే భార్యను కొడుతుంటాడు. చివరికి భార్య అతడి మీద ఎదురు తిరిగి తనకు బుద్ధి చెబుతుంది.
పురుషాధిక్యతకు ప్రతీకగా నిలిచే పాత్ర కావడంతో తన కొడుకుని ఆ పాత్రలో ఉండిపోవద్దని చెబుతున్నట్లున్నారు గీతా భాస్కర్. అందులోనూ ఈ చిత్ర కథానాయిక ఈషా రెబ్బాతో తరుణ్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గీతా కామెంట్స్ మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గీతా తన కొడుకు దర్శకుడు అయ్యాక, లేటు వయసులో నటిగా తన ముచ్చట తీర్చుకోవడం విశేషం. ‘ఫిదా’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘సీతారామం’ లాంటి చిత్రాల్లో సహజ నటనతో ఆమె ఆకట్టుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates