రిటైర్మెంట్‌ పై సింగర్ మరింత క్లారిటీ

చాలా తక్కువ సమయంలో దేశంలోనే టాప్ సింగర్లలో ఒకడిగా ఎదిగిన బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్.. కేవలం 38 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించడం సంగీత ప్రియులకు పెద్ద షాక్. తెలుగులోనూ ‘కనులను తాకే ఓ కలా’ (మనం) సహా కొన్ని మంచి పాటలు పాడిన అర్జిత్‌కు వివిధ భాషల్లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. 

అలాంటి గాయకుడు చిన్న వయసులోనే పాటలు పాడడం మానేస్తున్నట్లు ప్రకటించడాన్ని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఆవేశంలో ప్రకటన చేశాడేమో.. ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గుతాడేమో అని చూశారు ఫ్యాన్స్. కానీ అర్జిత్ ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రిటైర్మెంట్‌పై మరింత క్లారిటీ ఇస్తూ అతను మరో సోషల్ మీడియా పోస్టు పెట్టాడు.

రిటైర్మెంట్‌కు ఒక కారణమని చెప్పలేనని.. దాంతో ముడిపడి చాలా అంశాలు ఉన్నాయని అర్జిత్ తెలిపాడు. తాను ఎన్నో రోజులుగా ఈ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడు దీనికి అవసరమైన ధైర్యాన్నంతా కూడగట్టుకుని తన నిర్ణయాన్ని వెల్లడించానని అర్జిత్ పేర్కొన్నాడు. ఒక విషయమైతే చెప్పగలనని.. తనకు కొత్తదనం అంటే ఇష్టమని.. అందుకే తన పాటలను కూడా ఒకేలా పాడనని.. వేదికలపై వాటి ట్యూన్లు మార్చి కొత్తగా పాడడానికి ప్రయత్నించేవాడినని అర్జిత్ తెలిపాడు. 

సంగీతంలో కొత్త అంశాలు నేర్చుకోవాలనుకుంటున్నానని.. కొత్త గాయకుల పాటలు వినాలనుకుంటున్నానని.. అందుకే కొత్త సింగర్ల ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అర్జిత్ తెలిపాడు. అర్జిత్ మాటల్ని బట్టి చూస్తే దశాబ్దంన్నరగా పాటలు పాడుతున్న అర్జిత్‌కు తనకు తానే బోర్ కొట్టేసినట్లు అనిపిస్తోంది. సంగీత ప్రియులకు కూడా తన వాయిస్‌తో బోర్ కొట్టించకూడదనుకుంటున్నట్లున్నాడు. కానీ తన నిర్ణయం మాత్రం అభిమానులకు చాలా బాధ కలిగిస్తోంది.