ఇంటికి త్వరగా వస్తున్న అన్నగారు

మొన్న పొంగల్ పండక్కు విడుదలైన కార్తీ వా వాతియార్ బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని చవి చూసింది. జన నాయకుడు వాయిదాని క్యాష్ చేసుకుందామని చూసిన దర్శక నిర్మాతలకు డిజాస్టర్ దక్కింది. డిసెంబర్ లోనే రావాల్సిన ఈ సినిమా ఆర్థిక సమస్యల వల్ల నెల రోజుల తర్వాత థియేటర్లో అడుగు పెట్టింది.

తెలుగులో స్క్రీన్ల కొరత వల్ల ఇక్కడ రిలీజ్ చేసే రిస్క్ తీసుకోలేదు. కట్ చేస్తే ఒరిజినల్ వెర్షనే రివర్స్ అయ్యాక ఇక డబ్బింగ్ గురించి కష్టపడటం అనవసరం. అందుకే రెండు వారాలకే అన్నగారు వస్తారు ఓటిటిలో వస్తోంది. జనవరి 28 అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచే అయిదు భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

ఇంత త్వరగా ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా డిజిటల్ లో రావడం ఈ మధ్య కాలంలో ఎవరికీ జరగలేదు. అయితే అన్నగారు వస్తారుకి దక్కింగ్ రెసెప్షన్ చూసి ప్రైమ్ తో మాట్లాడుకున్న ప్రొడ్యూసర్ దాన్ని ముందస్తు స్ట్రీమింగ్ చేయడానికి అంగీకరించినట్టు చెన్నై రిపోర్ట్.

నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ కాప్ డ్రామాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. కొంచెం టెంపర్ ఛాయలు ఉండే ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం కూడా ఆకర్షణగా నిలవలేకపోయింది. మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న అన్నగారు వస్తారు పట్టుమని రెండు వారాలు నిలవలేకపోవడం ట్రాజెడీ.

ఆ ప్రకటన పట్ల కోలీవుడ్ బయ్యర్లు కస్సుమంటున్నారు. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే ఇలా చేయడం ద్వారా ప్రేక్షకులకు ఏం సంకేతం ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఒకపక్క థియేటర్ వ్యవస్థ కుప్పకూలే దశలో ఉండగా ఇలా టూ వీక్స్ అగ్రిమెంట్స్ ద్వారా జనాన్ని ఇంట్లోనే ఉండేలా చేస్తున్నారని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాత జ్ఞానవేల్ రాజాకు సూర్య కంగువ ఇచ్చిన షాక్ తర్వాత ఇప్పుడు తమ్ముడు కార్తీతో కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అయ్యింది. అన్నగారు వస్తారు కన్నా మూడు రోజుల ముందు విడుదలైన పరాశక్తి కూడా సోసో ఫలితమే అందుకుంది. ఇది కూడా తెలుగు డబ్బింగ్ థియేటర్ రిలీజ్ కావడం అనుమానమే.