ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా ఒక స్థాయి తెచ్చుకున్న నటుడు విశ్వక్సేన్. తొలి సినిమా వెళ్ళిపోమాకేలో సాఫ్ట్ క్యారెక్టర్ చేసిన అతను.. రెండో సినిమా ఫలక్‌నుమా దాస్‌కు ఎవ్వరూ ఊహించని మేకోవర్ ఇచ్చాడు. అగ్రెసివ్ క్యారెక్టర్లో చెలరేగిపోయి నటించాడు. ఈ సినిమాకు దర్శకుడు కూడా అతనే. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.
తర్వాత ఈ నగరానికి ఏమైంది, హిట్, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి మెమరబుల్ మూవీస్ చేసిన విశ్వక్‌కు కొన్నేళ్లుగా సరైన సినిమాలు పడట్లేదు. ముఖ్యంగా విశ్వక్ చివరి చిత్రం లైలా దారుణమైన ఫలితాన్నందుకుంది.
గత కొన్నేళ్లలో తెలుగు కాస్త పేరున్న హీరోలు చేసిన సినిమాల్లో వరస్ట్ లిస్టు తీస్తే ఇది ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమాతో విశ్వక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. లైలా తర్వాత ఇప్పటదాకా విశ్వక్ కొత్త సినిమా ఏదీ రిలీజ్ కాకపోవడంతో దాని రిజల్ట్ గురించి మాట్లాడడానికి విశ్వక్‌కు ఛాన్స్ రాలేదు.
ఐతే తన కొత్త చిత్రం ఫంకీ వచ్చే నెల 13న రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనుదీప్, హీరోయిన్ కాయదు లోహర్‌లతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన విశ్వక్.. లైలా ఫలితం గురించి స్పందించాడు. మామూలుగా తాను ఏ సినిమా చేసినా తన తల్లి తనను చూసి మురిసిపోతుందని.. యావరేజ్ చిత్రంలో నటించినా కూడా షో అయ్యాక తనను పట్టుకుని పొంగిపోతున్నట్లు మాట్లాడుతుందని.. కానీ లైలా మూవీ షో అయ్యాక మాత్రం ఆమె భిన్నంగా స్పందించిందని విశ్వక్ వెల్లడించాడు.
తనవైపు ఆమె కొన్ని క్షణాల పాటు జాలిగా చూసిందని.. దాన్ని బట్టే ఆ సినిమా రిజల్ట్ ఏంటో అర్థమైపోయిందని విశ్వక్ తెలిపాడు. ఇక మరో ప్రశ్నకు సమాధానంగా.. తన తల్లి చిన్నప్పటి నుంచి నువ్వు హీరోలా ఉన్నావు అనేదని, దాన్ని తాను సీరియస్‌గా తీసుకుని హీరో అయ్యానని విశ్వక్ చెప్పాడు.
గతంలో తన సినిమాలను ప్రమోట్ చేయడంలో భాగంగా కొంచెం హద్దులు దాటి ప్రవర్తించేవాడినని.. పబ్లిసిటీ గిమ్మిక్కులు చేసేవాడినని.. ఇప్పుడు వయసు పెరిగి మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి అలాంటివి చేయట్లేదని విశ్వక్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates