సినీ హీరోలను అభిమానించే విషయంలో ఇటు తెలుగు వాళ్లు.. అటు తమిళులు ఎవరికి వారే సాటి అన్నట్లుంటారు. సినిమా హీరోలను వాళ్లు దేవుళ్లలా చూస్తారు. ఇప్పుడంటే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేయడం.. అవతలి హీరోల మీద విషం చిమ్మడం ఒక రకమైన అభిమానంగా మారిపోయిన రోజులు చూస్తున్నాం.
కానీ తాము ఆరాధించే హీరో మీద అపారమైన ప్రేమను చూపిస్తూ.. వారి పేరు మీద ఎన్నో మంచి పనులు చేసి ఆ హీరోకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టే అభిమానులను ముందు తరంలో చాలామందిని చూడొచ్చు. అలా సూపర్ స్టార్ రజినీ మీద అభిమానంతో ఈ రోజుల్లో కూడా ఐదు రూపాయలకే పరోటా అమ్ముతూ.. సూపర్ స్టార్ ప్రేమను కూడా పొందిన ఒక అభిమాని వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని మదురైకి చెందిన శేఖర్ అనే అభిమాని.. చాలా ఏళ్ల నుంచి ఆ నగరంలో ఒక హోటల్ నడుపుతున్నాడు. సూపర్ స్టార్ పేరు మీదే ఈ హోటల్ పెట్టిన అతను.. 15 ఏళ్ల నుంచి ఐదు రూపాయలకే పరోటా అమ్ముతున్నాడు.
ఐతే మొదలుపెట్టినపుడు 5 రూపాయలకు పరోటా ఇవ్వడమంటే పెద్ద విషయం కాదు. కానీ ఈ రోజుల్లో కూడా ఆ రేటుతో పరోటా అమ్మడం చిన్న విషయం కాదు. కానీ రజినీ మీద అభిమానంతో అతను అదే రేటుతో పరోటాలు అమ్ముతూ హోటల్ నడుపుతున్నాడు.
ఎక్కువ లాభాలు ఆశించకుండా తన హోటల్‌కు వచ్చే జనాలకు కడుపు నింపడమే లక్ష్యంగా సాగిపోతున్నాడు. ఆ హోటల్లో అడుగుపెడితే నేమ్ బోర్డు నుంచి ప్రతి చోటా రజినీ ఫొటోలే కనిపిస్తాయి. శేఖర్ ఒంటి మీద కూడా రజినీ పేరు మీద పచ్చబొట్టు కనిపిస్తుంది.
ఈ వీరాభిమాని గురించి రజినీకి కూడా తెలియడంతో ఆయన స్వయంగా ఆ హోటల్‌కు వచ్చి తన పేరు మీద ఇంత చేస్తున్న శేఖర్‌కు బంగారు ఛైన్ కానుకగా ఇవ్వడమే కాక అతణ్ని సత్కరించడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates