వారణాసి బ్రాండుతో ‘బ్లఫ్’ ప్రచారం

ఒక టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా చేయడం వల్ల ఎంత గొప్ప ప్రయోజనం ఉంటుందో ప్రియాంకా చోప్రాకు అర్థమవుతోంది. అమెజాన్ ప్రైమ్ కోసం తను నటించిన ది బ్లఫ్ ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ ని మొన్న రాజమౌళి, తాజాగా మహేష్ బాబుతో పాటు ఇతర సెలబ్రిటీలు షేర్ చేయడం మొదలుపెట్టడంతో క్రమంగా దీని మీద మూవీ లవర్స్ ఆసక్తి పెరుగుతోంది.

తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లోనూ దీన్ని అందుబాటులోకి తేనున్నారు. తన కుటుంబం జోలికి వచ్చిన కిరాతకులను ఎదురుకునే ఒక మహిళ సాహసాల కథే ది బ్లఫ్.

వయొలెన్స్, యాక్షన్ పుష్కలంగా కనిపిస్తున్న ది బ్లఫ్ ని సుప్రసిద్ధ రస్సో బ్రదర్స్ సృష్టించారు. స్టోరీ బ్యాక్ డ్రాప్ 1846 కరేబియన్ సముద్రం నుంచి మొదలవుతుంది. దృశ్యంలో వెంకటేష్ తన ఫ్యామిలీని కాపాడుకున్నట్టుగా ఇందులో ప్రియాంకా చోప్రా పిల్లల కోసం రక్తపాతం సృష్టించేందుకు వెనుకాడదు.

కంటెంట్ సంగతి పక్కనపెడితే ప్రైమ్ అడగకుండానే బ్లఫ్ కి మంచి పబ్లిసిటీ వచ్చేస్తోంది. వారణాసిలో మెయిన్ లీడ్ కాబట్టి సహజంగానే మహేష్ బాబు ఫ్యాన్స్ తన మీద ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. ఎలాగూ రిలీజయ్యాక కంటెంట్ కనక బాగుంటే మరిన్ని పొగడ్తలు సెలబ్రిటీల నుంచి వస్తాయి కాబట్టి రిచ్ ఇంకా పెరుగుతుంది.

చాలా గ్యాప్ తర్వాత ప్రియాంకా చోప్రా తెలుగు హీరో సరసన నటించింది. గతంలో రామ్ చరణ్ తో జంజీర్ చేసినా అది ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. కానీ దాని దర్శకుడు బ్రాండ్ ఏమంత ఉపయోగపడలేదు. బొమ్మ కూడా డిజాస్టరే. ఈసారి డీల్ చేస్తోంది రాజమౌళి.

ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గుర్తింపు వచ్చాక జేమ్స్ క్యామరూన్ అంతటి దిగ్గజాలు సైతం వారణాసి సెట్ కు వస్తామని అంటున్నారు. ఈ స్థాయిలో హైప్ ఉంది కాబట్టి బ్లఫ్ కు ఇదంతా ఉపయోగపడనుంది. థియేటర్ రిలీజ్ కాదు కనక వ్యూస్ ఎక్కువగా వస్తాయి కానీ దానికి వారణాసి బ్రాండ్ తోడైతే ఇంకే స్థాయిలో స్పందన ఉంటుందో ఊహించుకోవచ్చు.