ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ మీద పెట్టడం ప్రభాస్ కు ఎంత మేలు చేస్తోందో అంతే మోతాదులో చేటు కూడా కలిగిస్తోంది. ప్యాన్ ఇండియా బడ్జెట్ లు కావడం వల్ల నిర్మాతలు వీటిని బ్యాలన్స్ చేసుకోవడం కష్టంగా మారింది. రాజా సాబ్ ఆలస్యానికి కారణం ఏదైనా దాని ప్రభావం నేరుగా ఫౌజీ మీద పడింది.
దాంతో రెండు షూటింగులు సమాంతరంగా జరిగిన సందర్భాల్లో, డేట్ల సమస్య వచ్చి అనుకున్న టైంలో షెడ్యూల్స్ పూర్తి కాని ఉదంతాలున్నాయి. సరే రాజా సాబ్ వచ్చింది, ఫలితం తేలిపోయింది కాబట్టి దాని టాపిక్ అనవసరం. ఇప్పుడు అందరి దృష్టి ఫౌజీ మీదకు కాకుండా స్పిరిట్ పైకి వెళ్తోంది.
ఆల్రెడీ సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఫౌజీ కాకుండా మొన్నెప్పుడో మొదలైన స్పిరిట్ రిలీజ్ డేట్ 2027 మార్చి 5 అని ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అలాని ఫౌజీ వాయిదా పడిందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించలేదు. విడుదల తేదీ చెప్పే ప్రయత్నాలూ జరగలేదు. కానీ స్పిరిట్ మీద క్లారిటీ వచ్చేసింది.
తన సినిమా పూర్తయ్యే వరకు ప్రభాస్ పూర్తిగా తనకే కమిట్ మెంట్ ఇవ్వాలని సందీప్ రెడ్డి వంగా కండీషన్ పెట్టిన మాట నిజమే అయితే ఫౌజీ మరింత ఆలస్యమవుతుంది. ఎందుకంటే గెటప్ పరంగా స్పిరిట్ లో ప్రభాస్ పూర్తిగా వేరే లుక్ లో దర్శన మివ్వబోతున్నాడు.
ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫౌజీ ఈ ఏడాది విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ బ్యాలన్స్ షూట్ కి ప్రభాస్ లభ్యత ఎంత మేరకు ఉంటుందనే దాన్ని బట్టి నిర్ణయంలో మార్పులు చేర్పులు జరగొచ్చు.
కొన్ని వర్గాలు ఏకంగా ఒక అడుగు ముందుకేసి ఫౌజీ వచ్చేది 2028 అని ప్రచారం చేస్తున్నాయి. కానీ అంత దూరం వెళ్లకపోవచ్చు. సలార్ 2, కల్కి 2 టీమ్స్ ప్రభాస్ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాయి. ఫౌజీ బృందం నుంచి వీలైనంత త్వరగా ఏదో ఒక అప్డేట్ వస్తే అభిమానులు దేని కోసం ముందు ఎదురు చూడాలనేది డిసైడ్ అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates