దురంధర్ 50 నాటౌట్… ట్రూ బ్లాక్ బస్టర్

ఒకప్పుడు సినిమాలు వంద రోజులు, సిల్వర్ జూబ్లీ ఆడితే బ్లాక్ బస్టర్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడా అర్థం మారిపోయింది. మొదటి వారంలోనే ఎన్ని కోట్లు వసూలు చేసిందనే దాన్ని బట్టి స్టేటస్ నిర్ణయిస్తున్నారు. వారాల తరబడి థియేటర్ రన్ లేకపోయినా పర్వాలేదు, రెవిన్యూ కనిపిస్తే చాలనే రీతిలో ఇండస్ట్రీ చాలా మారిపోయింది.

కానీ అప్పుడప్పుడు దీనికి మినహాయింపుగా నిలిచే క్లాసిక్స్ వస్తాయి. దానికి దురంధర్ కంటే ఉదాహరణ అక్కర్లేదు. ఈ రోజు అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకున్న ఈ స్పై డ్రామా బాలీవుడ్ కు కొత్త పాఠాలు నేర్పించింది. గూఢచారి నేపధ్యాన్ని ఎలా వాడుకోవాలో ఇదివరకు లేని గ్రామర్ ఆవిష్కరించింది.

యాభై రోజులు దాటినా సరే దురంధర్ ఇంకా స్టడీగానే ఉండటం షాక్ కలిగించే విషయం. నలభై తొమ్మిదో రోజు బుక్ మై షోలో 18 వేలకు పైగా టికెట్లు ఇప్పటికీ అమ్ముడు పోతుండటం ఊహకందని షాక్. గ్రాస్ కాకుండా కేవలం నెట్ రూపంలోనే 886 కోట్లకు పైగా వసూలు చేసిన దురంధర్, వచ్చే వారం జనవరి 30 నెట్ ఫ్లిక్స్ లో ఓటిటి స్ట్రీమింగ్ జరిగే దాకా ఆగేలా లేదు.

ఏపీ తెలంగాణ కలిపి కేవలం హిందీ వెర్షన్ తోనే 50 కోట్ల దాకా గ్రాస్ వచ్చిందని ట్రేడ్ టాక్. తమిళనాడులోనూ మంచి ఘనతే అందుకున్న దురంధర్ ఒక్క కేరళలో మాత్రమే కొంచెం వీక్ గా పెర్ఫార్మ్ చేసింది. మిగిలిన చోట్ల వసూళ్ల మోత మోగించింది.

దురంధర్ 2 మార్చి 19 విడుదల కానున్న సంగతి తెలిసిందే. వాయిదా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు వాటిని పూర్తిగా కొట్టి పారేస్తున్నారు. ఎలాంటి పోస్ట్ పోన్ ఉండదని వివిధ రూపాల్లో తేల్చి చెబుతున్నారు. అదే రోజు యష్ టాక్సిక్ ఉండటంతో ఈ క్లాష్ పట్ల బయ్యర్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

దురంధర్ 2 కనక అంచనాలు అందుకుంటే ఫుల్ రన్ రెండు వేల కోట్లకు దగ్గరగా వెళ్లొచ్చని ప్రాధమిక అంచనా. హిందీతో పాటు తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో డబ్బింగ్ చేయడం వల్ల మరింత మెరుగైన నెంబర్లు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.