‘బంగార్రాజు’ దర్శకుడు ఎక్కడ?

​టాలీవుడ్‌లో అనిల్ రావిపూడికి ఏ స్థాయిలో సంక్రాంతి సెంటిమెంట్, 100% స్ట్రైక్ రేట్ ఉందో, ఒకప్పుడు కళ్యాణ్ కృష్ణ కూరసాల కూడా అదే బాటలో కనిపించారు. అక్కినేని నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’, నాగచైతన్యకు ‘బంగార్రాజు’ వంటి సాలిడ్ పండగ హిట్స్ ఇచ్చి కమర్షియల్ డైరెక్టర్‌గా తన ముద్ర వేశారు. చేసినవి తక్కువ సినిమాలే అయినా, బాక్సాఫీస్ దగ్గర అక్కినేని హీరోలకు పక్కా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందించడంలో సక్సెస్ అయ్యారు.

​కళ్యాణ్ కృష్ణ కెరీర్ గ్రాఫ్ గమనిస్తే, 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో డెబ్యూ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత ‘రారండోయ్ వేడుక చూద్దాం’తో చైతూకి మంచి హిట్ ఇచ్చారు. 2018లో రవితేజతో చేసిన ‘నెల టిక్కెట్’ దారుణంగా డిజాస్టర్ అయినప్పటికీ, మళ్ళీ 2022లో ‘బంగార్రాజు’తో సంక్రాంతి విన్నర్‌గా నిలిచారు. కానీ ఆ సినిమా తర్వాత గత మూడేళ్లుగా ఈ దర్శకుడి నుండి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం గమనార్హం.

​మధ్యలో మెగాస్టార్ చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ ఒక సినిమా చేస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దాదాపు కమర్షియల్ ఫార్మాట్ లో పండగ టైమ్ లో వరుస హిట్లు కొట్టిన ఈ దర్శకుడు, ఇప్పుడు రేసులో ఎక్కడా కనిపించకపోవడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఫుల్ సినిమా ఇచ్చిన తర్వాత కూడా ఇంత సుదీర్ఘ గ్యాప్ రావడం చాలా అరుదు.

​కళ్యాణ్ కృష్ణ కుటుంబానికి బలమైన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆయన సోదరుడు కురసాల కన్నబాబు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. బహుశా వ్యక్తిగత కారణాలు లేదా సరైన కథ కుదరకపోవడం వల్లే ఆయన కెమెరాకు దూరంగా ఉండి ఉండవచ్చు.

అయితే తన మార్క్ విలేజ్ డ్రామాలతో మెప్పించే కళ్యాణ్ కృష్ణ, మళ్ళీ ఎప్పుడు మెగాఫోన్ పడతారో చూడాలి. ​టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాల వైపు పరుగులు తీస్తోంది. ఇలాంటి టైమ్ లో కళ్యాణ్ కృష్ణ తన పాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫార్ములాతోనే వస్తారా లేక కొత్తగా ఏదైనా ట్రై చేస్తారా అనేది చూడాలి.