అఖండ 2, రాజాసాబ్… రెండిటిలో ఒకే తప్పు!

ఇటీవల వచ్చిన ‘ది రాజా సాబ్’, గత ఏడాది చివర్లో వచ్చిన ‘అఖండ 2’.. రెండు సినిమాలు కూడా పక్కా బ్లాక్ బస్టర్ అయ్యే పొటెన్షియల్ ఉన్నవే. కానీ మేకర్స్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీటి ఫలితాన్ని ప్రభావితం చేశాయని అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలను కేవలం మన తెలుగు ఆడియన్స్ కోసం మాత్రమే తీసి ఉంటే, వేరే భాషల మార్కెట్‌ను ఒక బోనస్ లాగా ట్రీట్ చేసి ఉంటే బాక్సాఫీస్ దగ్గర వీటి రేంజ్ మరోలా ఉండేదని అభిప్రాయాలు వస్తున్నాయి.

అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ రెండు సినిమాల సెటప్ భారీ స్థాయిలో ప్లాన్ చేయడం. ముఖ్యంగా హిందీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో కథలో కొన్ని అనవసరమైన మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. నార్త్ ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా సీన్లు డిజైన్ చేయడం వల్ల సినిమాలోని ఒరిజినల్ సోల్ మిస్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. మన నేటివిటీని వదిలేసి గ్లోబల్ అప్పీల్ కోసం వెళ్లడం వల్ల రెండు వైపులా బ్యాలెన్స్ తప్పింది.

ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ల విషయంలో ఈ ఇంపాక్ట్ స్పష్టంగా తెలిసింది. హిందీ మార్కెట్ కోసమని సెకండ్ హాఫ్‌లో మార్పులు చేయడం వల్ల కథలో వేగం తగ్గింది. తెలుగు ప్రేక్షకులకు అలవాటైన మాస్ ఎలిమెంట్స్ లేదా కామెడీ టైమింగ్ కంటే, అందరికీ అర్థమవ్వాలి అనే పాయింట్ మీద ఫోకస్ పెట్టడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫ్లో దెబ్బతింది. దీనివల్ల ఇక్కడి ఆడియన్స్ ఆశించిన కిక్ బాక్సాఫీస్ దగ్గర మిస్ అయ్యింది.

‘అఖండ 2’ కమర్షియల్ గా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోవడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పాలి. మొదటి పార్ట్ లో ఉన్న ఆ పక్కా లోకల్ ‘మాస్’ ఎనర్జీ, సెకండ్ పార్ట్ వచ్చేసరికి హిందీ మార్కెట్ కోసం చేసిన హడావుడిలో కాస్త పలచబడింది. బాలయ్య మార్క్ గర్జనను మన ఆడియన్స్ ఎంతలా ఎంజాయ్ చేస్తారో, వేరే భాషల వారికి అది కనెక్ట్ చేయడం కోసం చేసే సర్దుబాట్లు ఒక్కోసారి నెగిటివ్ గా మారుతుంటాయి.

‘ది రాజా సాబ్’ విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. ప్రభాస్ రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి, మారుతి తన మార్క్ లోకల్ కామెడీని పక్కనపెట్టి యూనివర్సల్ అప్పీల్ కోసం ట్రై చేశారు. కానీ ప్రభాస్ నుండి ఆడియన్స్ కోరుకున్నది పక్కా లోకల్ ఎంటర్టైన్మెంట్.

వేరే మార్కెట్ల కోసం కథను మార్చడం కంటే, మన కథనే మన స్టైల్ లో చెబితేనే ప్రపంచం మొత్తం చూస్తుందని ‘కాంతార’ లాంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. ఏదేమైనా బాక్సాఫీస్ దగ్గర గెలవాలంటే ముందు మన ఇంటి ఆడియన్స్ ను తృప్తి పరచాలి. ఆ తర్వాతే వేరే మార్కెట్ల గురించి ఆలోచించాలి.

రానున్న రోజుల్లో వచ్చే పెద్ద సినిమాలు కూడా ఈ విషయాన్ని గమనిస్తే మంచిది. పాన్ ఇండియా అనేది ఒక బోనస్ గా ఉండాలి కానీ, అదే మెయిన్ టార్గెట్ అయ్యి మన నేటివిటీని చంపేయకూడదు. అప్పుడే సినిమా లాంగ్ రన్ లో క్లాసిక్ గా నిలుస్తుంది.