ఆస్కార్ పాట రెహమాన్‌ది కాదా?

తన మతం వల్లే అవకాశాలు తగ్గాయంటూ ఇటీవల లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీతంలో నంబర్ వన్ కంపోజర్‌గా ఉన్న రెహమాన్.. ఇప్పుడిలా మాట్లాడ్డం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తన వ్యాఖ్యలపై రెహమాన్ వివరణ ఇచ్చినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. 

ఈ నేపథ్యంలో రెహామన్‌కు సంబంధించిన ప్రతికూల విషయాలను బయటికి తీసి ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు తన వ్యతిరేకులు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ పాత ఇంటర్వ్యూ ఒకదాంట్లో రెహమాన్ గురించి చెప్పిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఏఆర్‌కు ఆస్కార్ పురస్కారం తెచ్చిపెట్టిన ‘జైహో’ సాంగ్ అసలు ఆయన కంపోజ్ చేసింది కాదని వర్మ వెల్లడించాడు ఆ ఇంటర్యూలో. దీని గురించి ఆయన వర్మ ఏమన్నాడంటే..?

‘‘సుభాష్ ఘై, రెహమాన్‌ కలయికలో ‘తాళ్’ సినిమా వచ్చాక.. ‘యువరాజ్’ అనే మరో సినిమాకు పని చేయడానికి అంగీకారం కుదిరింది. ఐతే రెహమాన్ పాటలు ఇవ్వడంలో ఎప్పుడూ లేటే. ‘యువరాజ్’ సినిమాలో పాట చిత్రీకరణ కోసం సెట్ వేసి సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ల డేట్లు కూడా తీసుకున్నారు సుభాష్ ఘై. కానీ పాట మాత్రం ఎంతకీ రెడీ కాలేదు. దీని గురించి రెహమాన్‌కు ఫోన్ చేస్తే లండన్‌లో ఉన్న ఆయన.. తాను చెన్నైకి వెళ్లేముందు ముంబయికి వచ్చి పాట ఇస్తానని చెప్పాడు.

రెహమాన్ కోసం స్టూడియోలో ఎదురు చూస్తున్న సుభాష్‌‌ను అక్కడ సుఖ్విందర్ సింగ్ కలవగా.. రెహమాన్ మీ కోసం పాట చేయమన్నట్లు అతను చెప్పాడు. సుఖ్విందర్ తెలియక ఏదో అనేశాడని సుభాష్ అనుకున్నాడు. కానీ రెహమాన్ వచ్చాక, పాట రెడీ చేశావా అని సుభాష్ ముందే అడిగి.. దాన్ని వినిపించమన్నాడు.

పాట విన్నాక బాగుందా అని సుభాష్‌ను అడిగితే.. ఆయన తీవ్ర ఆగ్రహంతో నీకు 3 కోట్లు ఇచ్చింది సుఖ్విందర్‌తో పాట చేయించడానికా, నేను తనతో పని చేయించుకోలేనా అని అరిచాడు. దీనికి రెహమాన్ కోపంగా బదులిస్తూ.. మాటలు జాగ్రత్త, మీరు నాకు డబ్బిచ్చింది నా పేరు వాడుకోవడానికి మాత్రమే. నేనిచ్చే పాట నేనే కంపోజ్ చేయాలనేమీ లేదు.

ఎవరైనా చేసి ఇవ్వొచ్చు. మీకు ఈ పాట నచ్చకపోతే ఇంకోటి చేసిస్తా అన్నాడు. ఆ కథ అక్కడ అల ా ముగియగా.. చెన్నైకి వెళ్లిన రెహమాన్ ఆ పాట నచ్చిందంటూ దాన్ని తనకు మెయిల్ చేయమన్నాడు. కొంత కాలానికి రెహమాన్ మేనేజర్ సుఖ్విందర్‌ అకౌంట్లోకి 5 లక్షల డబ్బు వేసి, అతను ఇంతకుముందు ఇచ్చిన పాటను ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు రెహమాన్ అమ్మాడని, ఇది నీ వాటా అని చెప్పాడు. ఆ పాటే ‘జైహో’. ఈ విషయాన్ని నాకు సుఖ్విందరే చెప్పాడు’’ అని వర్మ వెల్లడించాడు. 

రెహమాన్‌ను టార్గెట్ చేయడానికి నెటిజన్లు ఇప్పుడు ఈ వీడియోను వాడుతున్నారు. ఆస్కార్ తెచ్చిపెట్టిన పాట రెహమాన్‌ది కాదా, అతను ఇలా చేస్తాడా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఐతే తన వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో వర్మ ఒక పోస్టు పెట్టాడు. తన వ్యాఖ్యల్ని మరోలా కోట్ చేస్తున్నారని.. రెహమాన్ గొప్ప సంగీత దర్శకుడని, అతడిపై తనకు అపారమైన గౌరవం ఉందని ఈ పోస్టులో వర్మ పేర్కొన్నాడు.