రాజుగారి లాగే అందరూ పవన్ మాట వింటే…

తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పట్నుంచో హైదరాబాద్ కేంద్రంగా ఉంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా ఇండస్ట్రీకి హైదరాబాదే కేంద్రం. ఐతే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌ను కూడా షూటింగ్‌ల కోసం ఉపయోగించుకోవాలని, అవసరమైన ప్రోత్సాహాలన్నీ అందిస్తామని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి.

కానీ ఒకప్పట్లా రియల్ లొకేషన్లలో సినిమాలు తీయడం తగ్గిపోవడంతో ఏపీలో అనుకున్నంత మేర చిత్రీకరణలు జరగట్లేదు. ఐతే ఇటీవల ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీలో షూటింగ్స్ పెంచే ప్రయత్నం జరుగుతోంది. సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం షూటింగ్ చాలా వరకు ఏపీలోని గోదావరి ప్రాంతంలోనే జరిగింది.

ఇందుకు పవన్ కళ్యాణ్ మాటలే స్ఫూర్తి అని అంటున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. ఏపీలో ఎక్కువగా షూటింగ్స్ జరగాలంటూ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్‌లో చెప్పిన మాటలు తన మనసుకు హత్తుకున్నాయని నవీన్ చెప్పాడు. అందుకే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ భాగం షూటింగ్ చేశామని అతనన్నాడు.

తమ సినిమాకు ఎక్కడ షూటింగ్ జరిగినా అధికారులు సులువుగా అనుమతులు ఇచ్చేశారని.. ఎంతో సహకరరించారని.. స్థానికులు కూడా బాగా సహకరించారని నవీన్ తెలిపాడు. నవీన్‌లాగే టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు పవన్ మాటలను ఆలకించి.. అనుసరించాల్సిన అవసరం కనిపిస్తోంది.

ప్రతి సినిమాకూ అక్కడికి వెళ్లాలని కాదు కానీ.. కథ ప్రకారం ఏపీలో చిత్రీకరించాల్సి వచ్చినపుడు రియల్ లొకేషన్లను ఎంచుకోవడం వల్ల సినిమాకు ఒక అథెంటిసిటీ వస్తుంది. రియల్ లొకేషన్లలో చిత్రీకరణ కొంచెం కష్టమే అయినప్పటికీ.. సరైన ప్లానింగ్, జాగ్రత్తలతో షూటింగ్స్ ప్లాన్ చేస్తే ఒరిజినల్ క్వాలిటీ కనిపిస్తుంది. అలాగే బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఈ దిశగా టాలీవుడ్ నిర్మాతలు సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరముంది.