సూపర్ స్టార్ మహేష్ బాబు మాములుగా చాలా రిజర్వ్డ్ గా కనిపిస్తాడు. ఎక్కువగా మాట్లాడడు. కానీ ఆయనతో పనిచేసిన వాళ్ళు మహేష్ సెన్సాఫ్ హ్యూమర్ గురించి, తన అల్లరి గురించి కథలు కథలుగా చెబుతుంటారు. మహేష్ తో రెండు సినిమాలు తీసిన దర్శకుడు గుణశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మహేష్ కొంటెతనం గురించి పంచుకున్నాడు.
హీరోగా మహేష్ బాబుకు కెరీర్ ఆరంభంలో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రం ఒక్కడు. ఈ మైల్ స్టోన్ మూవీని డైరెక్ట్ చేసింది గుణశేఖరే. ఈ చిత్రం చాలావరకు సీరియస్ గానే సాగుతుంది కానీ.. అందులో ఒక కామెడీ ఎపిసోడ్ భలేగా పేలింది. పాస్ పోర్ట్ అధికారిగా పనిచేసే ధర్మవరపు సుబ్రహ్మణ్యంను మహేష్ బాబు తన మిత్ర బృందంతో కలిసి టార్చర్ పెట్టే సన్నివేశం అది.
కొత్తగా మొబైల్ ఫోన్ కొన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. తన ప్రియురాలికి నంబర్ చెబుతాడు. ఆ నంబర్ కి పదే పడే డయల్ చేసి ఇబ్బంది పెడతారు మహేష్ అండ్ కో. అయితే ఈ సన్నివేశంలో ధర్మవరపు చెప్పే మొబైల్ నెంబర్ ఒక్కడు నిర్మాత ఎంఎస్ రాజుదట. ఆయన నంబర్ వాడేద్దాం అని చెప్పింది స్వయంగా మహేష్ అట.
అలా వాడితే ఆయనకు ఇబ్బంది అవుతుంది, కాల్స్ వస్తాయి అని గుణశేఖర్ చెప్పినా మహేష్ ఊరుకోలేదట. చూసుకుందాం కానివ్వండి అంటూ నెంబర్ పెట్టించేసాడట. ఐతే సినిమా రిలీజ్ కావడం ఆలస్యం.. రాజుకు ఒకటే కాల్స్ వచ్చాయట. సినిమాలో ధర్మవరపుతో మహేష్ ఆడుకున్నట్లే మహేష్ ఫ్యాన్స్ రాజుతో ఆడుకున్నట్లు గుణశేఖర్ వెల్లడించాడు.
ఐతే సినిమా పెద్ద హిట్ అవడంతో ఆయన ఎక్కువ ఫీల్ కాకుండా దాన్ని ఎంజాయ్ చేశారని గుణ చెప్పాడు. సినిమాలో వాడింది రాజు మొబైల్ నెంబర్ అన్న సంగతి ఇంతకుముందే వెల్లడైంది కానీ.. ఆ నెంబర్ పెట్టించింది మహేష్ అన్న విషయం ఇప్పుడే బయట పడింది. తమ హీరోలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates