స్పిరిట్ వేసుకున్న స్కెచ్ చాలా పెద్దది

ఎవరూ ఊహించని విధంగా నిన్న సాయంత్రం స్పిరిట్ రిలీజ్ డేట్ ప్రకటించడం ప్రభాస్ ఫ్యాన్స్ ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. రాజా సాబ్ ఫలితం పట్ల బాధలో ఉన్న వాళ్ళకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పెద్ద రిలీఫ్ కలిగించారు. 2027 మార్చి 5 స్పిరిట్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు సింపుల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.

నిజానికి సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉంటుందనే గాసిప్ కొందరు ప్రచారంలోకి తెచ్చారు. దానికి సూపర్ కౌంటర్ అన్న తరహాలో కొన్ని గంటల వ్యవధిలోనే క్లారిటీ ఇచ్చేయడంలో వంగా మార్కు కనిపిస్తోంది. ఒక డేట్ చెప్పారంటే దానికి కట్టుబడి ఉండేందుకు సందీప్ వంగా చాలా కష్టపడతారు.

ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక స్పిరిట్ పెద్ద స్కెచ్ వేసుకుంది. అదేంటో చూద్దాం. ప్రభాస్ సినిమా బిజినెస్ రేంజ్ దృష్టిలో పెట్టుకుంటే సంక్రాంతి లాంటి సీజన్ లో రావడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే రెవిన్యూ వేరే సినిమాలతో పంచుకోవాల్సి ఉంటుంది. థియేటర్ల ఇబ్బందులు తలెత్తుతాయి.

మన శంకరవరప్రసాద్ గారు విషయంలో ఇదే జరుగుతోంది అదే. డార్లింగ్ కనక సోలోగా వస్తే ప్యాన్ ఇండియా రేంజ్ లో జరిగే అరాచకం వేరే లెవెల్ లో ఉంటుంది. కల్కి 2898 ఏడి, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ దాన్ని కలెక్షన్ల సాక్షిగా ఋజువు చేశాయి. సో ఈ కోణంలో ఇది రైట్ డెసిషన్.

మరొక యాంగిల్ ఏంటంటే ఇలా మార్చి 5 మీద కర్చీఫ్ వేయడం వల్ల ఇతర నిర్మాతలకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది. దానికి ముందు వెనుకా రావాలా వద్దా అనే దాని మీద వాళ్ళు ఒక కంక్లూజన్ కు రావొచ్చు. పైగా మహేష్ బాబు రాజమౌళి వారణాసి అదే నెల చివరి వారంలో వస్తుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో స్పిరిట్ ముందు జాగ్రత్త పడటం మంచిదే అవుతుంది.

ఒకవేళ ట్రేడ్ నుంచి ఏదైనా ఒత్తిడి వస్తే మేం ముందే చెప్పాం అనే అడ్వాంటేజ్ స్పిరిట్ బృందానికి ఉంటుంది. ఎలాగూ ఫౌజీ ఇదే ఏడాది దసరా లేదా దీపావళికి వస్తుంది కనక దానికి స్పిరిట్ కి అయిదారు నెలల గ్యాప్ ఉండటం అవసరం.