మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో కలిపి 84 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మెగా మూవీ, అసలైన సంక్రాంతి పండగకు చేయబోయే రాంపేజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
నిజానికి అభిమానులు ఆశించింది వంద కోట్ల పై మాటే. అయితే సోమవారం రిలీజ్ కావడంతో అంత మేజిక్ నెంబర్ సాధ్యపడలేదు. అందులోనూ టాక్ సంగతి పక్కనపెడితే రాజా సాబ్ ఇంకో రెండో వారంలోకి అడుగు పెట్టలేదు. దీని వల్ల స్క్రీన్ షేరింగ్ పరంగా అదే డామినేషన్ లో ఉంది. అయినా సరే ఎనభై నాలుగు అంటే భారీ నెంబరే.
పబ్లిక్ టాక్, రివ్యూస్, సోషల్ మీడియా సపోర్ట్ అన్నీ మన శంకరవరప్రసాద్ గారుకి పాజిటివ్ గా ఉండటం కలిసి వస్తోంది. బుక్ మై షోలో ఫస్ట్ డే 4 లక్షల 88 వేలకు పైగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోగా జనవరి 14 నుంచి ఇవి నెక్స్ట్ లెవెల్ కు వెళ్తాయని బయ్యర్లు అంచనా వేస్తున్నారు.
వరసగా భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి ఉన్నప్పటికీ మెగా మూవీకి వచ్చిన టాక్ దృష్ట్యా వాటి ప్రభావం తీవ్రంగా అయితే ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి దక్కుతున్న మద్దతు బయ్యర్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సెకండ్ షోలకు సైతం భారీ ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో టికెట్ రేట్లు 250 వరకూ ఉన్నప్పటికీ ఫ్యామిలీస్ ఆగట్లేదు, అవే రేట్లు కొంచం తగ్గిస్తే లెక్క వేరేలా ఉంటుంది.
సుమారు రెండు వందల కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలో దిగిన మన శంకరవరప్రసాద్ గారు దాదాపు సగం ప్రయాణం అప్పుడే పూర్తి చేసింది. ఇదే జోరు ఇంకొక్క పది రోజులు సాలిడ్ రన్ చూపించగలిగితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నమోదవుతుంది.
యుఎస్ లో రెండు మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతున్న చిరంజీవి తన సైరా, వాల్తేరు వీరయ్య రికార్డును దాటడం సులభంగానే కనిపిస్తోంది. చిరు ఇమేజ్, అనిల్ రావిపూడి బ్రాండ్ గ్రౌండ్ లెవెల్ లో ఏ స్థాయిలో ఉందో తెలుగు రాష్ట్రాల బిసి సెంటర్లు రుజువు చేస్తున్నాయి. ఏదైతేనేం మెగా ఫ్యాన్స్ కోరుకున్న ఫలితం అయితే వచ్చేసింది. రికార్డులు ఎక్కడిదాకా వెళ్తాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates