నైజాం బుకింగ్స్… ఇంకెంతసేపు రాజా సాబ్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దగ్గర హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రేపు జనవరి 9న ది రాజా సాబ్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అయితే రిలీజ్ కి కేవలం కొన్ని గంటలే టైమ్ ఉన్నా.. నైజాం ఏరియాలో మాత్రం బుకింగ్స్ ఊసే లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ, ఓవర్సీస్ అలాగే మిగతా రాష్ట్రాల్లో ఎప్పుడో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. 

ఇప్పటికే చాలా చోట్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. కానీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో బుక్ మై షో, పేటీఎం యాప్స్ చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురవుతోంది. అసలు నైజాం మార్కెట్ ప్రభాస్ కి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే.

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నం నుంచి నైజాం బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రీమియర్ షోలతో కలిపి టికెట్లు అందుబాటులోకి వస్తాయని ఒక టాక్ వినిపిస్తోంది. టికెట్ల రేట్ల పెంపు.. ఎక్స్ ట్రా షోల పర్మిషన్ల విషయంలో అధికారులు ప్రభుత్వ పెద్దల మధ్య చర్చలు సాగడమే ఈ ఆలస్యానికి మెయిన్ రీజన్ అని తెలుస్తోంది.

నిన్ననే హైకోర్టు టికెట్ రేట్ల విషయంలో నిర్మాతలకు ఊరటనిస్తూ ఒక తీర్పు ఇచ్చింది. హోంశాఖ నుంచి ఫైనల్ పర్మిషన్ రావడంలో జరిగిన డిలే వల్లే బుకింగ్స్ ఇంకా హోల్డ్ లో పడ్డాయి. గతంలో ప్రభాస్ సినిమాలకు మరీ ఇంత ఆలస్యం ఎప్పుడూ జరగలేదు.

సలార్ వంటి సినిమాలకు వారం ముందే బుకింగ్స్ తో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. సంక్రాంతి సీజన్ లో ఇలా జరగడం దారుణం అని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. పండగ టైమ్ లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేసుకునే వాళ్లకు ఇదొక కన్ఫ్యూజన్ గా మారింది. 

మధ్యాహ్నం బుకింగ్స్ ఓపెన్ అయితే ఒకేసారి జనాలు యాప్స్ మీద పడే అవకాశం ఉంది. దీనివల్ల సర్వర్లు క్రాష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏదేమైనా డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ లుక్ చూడాలని అంతా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం లోపు అన్ని క్లియర్ అయ్యి బుకింగ్స్ మొదలుపెడితేనే ఫ్యాన్స్ కి అసలైన కిక్ వస్తుంది. మరి కొన్ని గంటల్లో అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చి థియేటర్ల దగ్గర అసలైన పండగ సందడి మొదలవుతుందేమో చూడాలి.