చిరు-వెంకీ పాట‌లో లిరిక్ మార్పు నిజ‌మే

సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కాబోతున్న‌ మెగాస్టార్ చిరంజీవి సినిమా మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు నుంచి ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఒక పాట‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. అందులో చిరు, వెంకీల మీద తీసిన మెగా విక్ట‌రీ పాట‌లో ఒక చోట‌.. లిర‌క్‌ను మ‌ధ్య‌లో మార్చిన విష‌యం బ‌య‌ట‌ప‌డిపోయింది.

ఈ పాట‌లో చిరు.. “ఏంది వెంకీ సంగ‌తి”.. అంటే, “అదిరిపోద్ది సంక్రాంతి” అని వెంకీ అంటాడు. త‌ర్వాత వెంకీ.. “ఏంది బాసూ సంగ‌తి” అంటే.. “ఇర‌గ‌దీద్దాం సంక్రాంతి” అని చిరు బ‌దులిస్తాడు. ఐతే ఆ పాట‌లో విజువ‌ల్స్‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. “ఇర‌గ‌దీద్దాం సంక్రాంతి” అన్న చోట చిరుకు లిప్ సింక్ ఉండ‌దు.

ఆయ‌న వాస్త‌వంగా “మ‌న‌దే క‌దా సంక్రాంతి” అన్నట్లుగా అర్థ‌మ‌వుతుంది. మ‌రి మ‌ధ్య‌లో లిరిక్ ఎందుకు మార్చార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. మ‌న‌దే సంక్రాంతి అంటే పండ‌క్కి వ‌స్తున్న మిగ‌తా సినిమాల‌ను చిన్న‌బుచ్చిన‌ట్లు అవుతుంది.. అవి ఫెయిల‌వ్వాల‌ని కోరుకున్న‌ట్లు ఉంటుంది.

అందులోనూ రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్ర‌భాస్ సీనియ‌ర్ల ప‌ట్ల గౌర‌వ‌భావాన్ని చూపించిన తీరు చూశాక ఆ లిరిక్ అలా ఉంచ‌డం క‌రెక్ట్ కాద‌ని మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు టీం భావించిన‌ట్లుంది. చిరు, వెంకీల‌ను ఉద్దేశించే ప్ర‌భాస్ అలా మాట్లాడాడ‌న్న‌ది స్ప‌ష్టం. అందుకే అనిల్ రావిపూడి టీం లిరిక్‌ను మార్చింద‌ని అంతా అనుకున్నారు.

ఇప్పుడు ఆ విష‌యాన్ని చిరునే స్వ‌యంగా ధ్రువీక‌రించారు. బుధ‌వారం రాత్రి జ‌రిగిన‌ మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరు మాట్లాడుతూ.. మ‌న‌దే క‌దా సంక్రాంతి అని ఉన్న లిరిక్‌ను.. ఇర‌గ‌దీద్దాం సంక్రాంతి అని మార్చామ‌ని సంకేతాలు ఇచ్చారు.

ఈ సంక్రాంతి కేవ‌లం మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌దే కాదు మొత్తం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ది అని చెప్పాల‌న్న ఉద్దేశంతోనే అలా చేశామ‌ని చిరు చెప్పుకొచ్చారు. చిరు, వెంకీల‌ను ప్ర‌భాస్ అలా గౌర‌విస్తూ.. చిరు అండ్ టీం ఇలా రియాక్ట‌వ‌డం మంచి ప‌రిణామం అని.. సంక్రాంతికి వ‌చ్చే అన్ని సినిమాలూ విజయ‌వంత‌మై తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పండుగ వాతావ‌ర‌ణాన్ని తీసుకురావాల‌ని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.