మీనాక్షి… ఈ సంక్రాంతికీ జాక్‌పాట్ కొడుతుందా?

‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయింది మిస్ ఇండియా మాజీ రన్నరప్ మీనాక్షి చౌదరి. ఆ సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. ఆమె కథానాయికగా బాగానే బిజీ అయింది. తెలుగులో తన నాలుగో సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసింది మీనాక్షి. అదే.. 2024 సంక్రాంతికి రిలీజైన ‘గుంటూరు కారం’.

ఆ సినిమా ఆమెకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు కానీ.. తర్వాతి ఏడాది సంక్రాంతికి మాత్రం భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విక్టరీ వెంకటేష్ సరసన ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మీనాక్షి మరోసారి సంక్రాంతి రేసులో నిలుస్తుండడంతో మళ్లీ జాక్‌పాట్ కొడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సంక్రాంతికి మీనాక్షి నుంచి వస్తున్న ‘అనగనగా ఒక రాజు’ కూడా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి నటించింది. నవీన్‌తో కలిసి చాలా గట్టిగానే సినిమాను ప్రమోట్ చేస్తోంది మీనాక్షి. ఇందులో హీరోతో సమానంగా కీలకమైన పాత్రనే చేస్తోందామె. ఇప్పటిదాకా రిలీజైన ప్రోమోలన్నీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. గురువారం ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ లాంచ్ అవుతోంది.

ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. సినిమాకు సంక్రాంతి సీజన్లో బంపర్ ఓఫెనింగ్స్ రావడం పక్కా. పేరుకు ఇది చిన్న సినిమానే కానీ.. టాక్ బాగుంటే, సంక్రాంతి సీజన్లో అడ్వాంటేజ్ తీసుకుని పెద్ద విజయం సాధించే అవకాశముంది. ‘సంక్రాంతి వస్తున్నాం’ లాగే సినిమా రేంజికి మించి వసూళ్లు రావచ్చు. ఈసారి కూడా హిట్టు కొడితే మీనాక్షికి సంక్రాంతి లక్కీ ఛార్మ్‌గా పేరు రావడం.. తర్వాతి ఏడాది కూడా ఏదో ఒక సంక్రాంతి సినిమాలో ఆమెకు చోటు దక్కడం పక్కా.