హమ్మయ్య… టికెట్ రేట్ల టెన్షన్ తీరింది

తెలంగాణ చిరంజీవి, ప్రభాస్ అభిమానులకు పెద్ద ఊరట దొరికింది. గతంలో టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేదంటూ సింగల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు కేవలం పుష్ప 2, గేమ్ చేంజర్, ఓజి, అఖండ 2కు మాత్రమే వర్తిస్తాయని, ఇప్పుడు విడుదలయ్యేవి కొత్తగా అనుమతులు తీసుకోవచ్చని హైకోర్టు పేర్కొనడంతో రూట్ క్లియరయ్యింది.

ఇప్పుడు బంతి కోర్టు నుంచి రేవంత్ రెడ్డి సర్కారుకు మారింది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎలాగూ కోర్ట్ చెప్పేసింది కాబట్టి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. సో రెండు సినిమాలకు కోరిన వరాలు ఇచ్చే అవకాశాలున్నాయి.

రేపు రాజా సాబ్ ప్రీమియర్లు అనుకున్న టైంకే ప్రారంభం కాబోతున్నాయి. వెయ్యి రూపాయల ఫ్లాట్ రేట్ తో తెలంగాణతో పాటు ఏపిలోనూ షోలు స్టార్ట్ అవుతాయి. అభిమానులు బుకింగ్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇంకో ముప్పై గంటల కంటే తక్కువ సమయం ఉండటంతో ఆన్ లైన్ లో ఆలస్యంగా పెడితే నెంబర్ల మీద ప్రభావం ఉంటుందని వాళ్ళ టెన్షన్.

బజ్ పరంగా చూసుకుంటే కల్కి 2898 ఏడి కంటే రాజా సాబ్ కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తున్నా ఒక్క షో అయ్యాక లెక్కలు మారిపోతాయని, డార్లింగ్ మాస్ తో పాటు మారుతి ఆవిష్కరించిన కొత్త ప్రపంచం షాక్ ఇస్తుందని టీమ్ నమ్ముతోంది.

జిఓలు ఏ నిమిషమైనా బయటికి రావొచ్చు. ఏపీలో ఇబ్బందులు లేవు. కూటమి ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు విషయంలో ముందు నుంచి అందరికీ సానుకూలంగానే ఉంది. అందుకే కూలి, కాంతార చాప్టర్ 1 లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా హైక్స్ తెచ్చుకున్నాయి.

రాజా సాబ్ వచ్చిన మూడు రోజులకు మన శంకరవరప్రసాద్ గారు ప్రీమియర్లు ఉంటాయి. దీనికి ఆరు వందల రేట్ ఫిక్స్ చేయబోతున్నారు. మిగిలిన మూడు సినిమాలు అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి పెంపు జోలికి వెళ్ళకపోవచ్చని టాక్. విజయ్ జన నాయకుడు సైతం రెగ్యులర్ రేట్లతోనే ప్రొసీడ్ అవ్వొచ్చని తెలిసింది.