విశ్వంభర వదులుకున్న గోల్డెన్ ఛాన్స్

మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ మేనియాలో మునిగిపోయి పట్టించుకోవడం లేదు కానీ అప్పుడెప్పుడో స్టార్ట్ అయ్యి, ఎప్పుడో అయిపోయిన విశ్వంభర ఊసులు ఎక్కడా వినిపించడం లేదు. విఎఫెక్స్ క్వాలిటీ మీద విమర్శలు వచ్చాక ఏకధాటిగా వాయిదా వేసుకున్న టీమ్ తర్వాత వదిలిన శ్రీరామ పాట మీద కూడా ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయింది.

కొత్త టీజర్ కు వ్యూస్ అయితే వచ్చాయి కానీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కాలేకపోయింది. దర్శకుడు వసిష్ఠని ఏమైనా అడుగుదామంటే బయట కనిపిస్తే ఒట్టు అనేలా మాయమైపోయారు. ఇప్పుడు ప్రమోషన్లు చేయడానికి రైట్ టైం కాదనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం.

ఇది కాసేపు పక్కనపెడితే ఒకవేళ మన శంకరవరప్రసాద్ బదులు విశ్వంభర సంక్రాంతి రేసులో ఉంటే ఏం జరిగేదన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్టే. ఎందుకంటే ఈసారి పండక్కు రాజా సాబ్ తప్ప వేరే విజువల్ గ్రాండియర్, టయర్ 1 స్టార్ నటించిన పెద్ద సినిమా కానీ లేదు.

అన్నీ ఎంటర్ టైనర్లే. ప్రభాస్ సినిమా కూడా హారర్ జానర్ కాబట్టి దాన్ని వేరుగా పరిగణించాలి. ఒకవేళ విశ్వంభర అవుట్ ఫుట్ బాగుండి ఈ ఫెస్టివల్ కు వచ్చి ఉంటే చిరు ఇమేజ్ ప్లస్ టాప్ క్లాస్ విఎఫెక్స్ కలిసి చిన్నా పెద్దాని థియేటర్లకు లాగేది. కల్కిలాగా వర్కౌట్ చేసుకునే ఛాన్స్ ఉండేది.

కానీ ఇప్పటికీ విశ్వంభర పనులు ఒక కొలిక్కి రాలేదని ఇన్ సైడ్ టాక్. విఎఫెక్స్ వంద శాతం పూర్తి సంతృప్తిగా అనిపిస్తే తప్ప రిలీజ్ చేసే ఉద్దేశంలో నిర్మాతలు లేరని వినికిడి. యువి క్రియేషన్స్ సంస్థ ఆర్థికంగా కొంచెం హెచ్చుతగ్గుల్లో ఉన్నప్పటికీ విశ్వంభర కనక సాలిడ్ గా ఆడితే ఈజీగా కంబ్యాక్ అవ్వొచ్చనే నమ్మకంతో ఉంది.

అనుష్కతో తీసిన ఘాటీ దారుణంగా ఫ్లాప్ కావడంతో పాటు అఖిల్ తో ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ వాయిదా పడటం పరిస్థితి ఏంటో చెప్పకనే చెబుతోంది. ఇదంతా ఎలా ఉన్నా ఇదే సంవత్సరం మే లేదా జూన్ నెలల్లో విశ్వంభర విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.