కేజీఎఫ్ హీరో… ఎందరు హీరోయిన్లు బాబోయ్

‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ సినిమాలతో యశ్ అనే మిడ్ రేంజ్ కన్నడ హీరో.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్లలో ఒకడిగా ఎదిగిపోయాడు. ఐతే ‘కేజీఎఫ్-2’ తర్వాత తన ఫాలోఅప్ మూవీని ప్లాన్ చేసుకోవడంలో అతను కొంచెం తడబడ్డాడు. చాలా గ్యాప్ తీసుకుని అతను లైన్లో పెట్టిన ‘టాక్సిక్’ మూవీ సెట్స్ మీదికి వెళ్లడంలో.. షూటింగ్ జరుపుకోవడంలో ఆలస్యం జరిగింది.

మేకింగ్ దశలో దీని చుట్టూ నెగెటివిటీ ముసురుకుంది. ఫస్ట్ టీజర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, రీషూట్లు జరుగుతున్నాయని, సినిమా వాయిదా పడబోతోందని వార్తలు రావడం ఈ నెగెటివిటీకి కారణం. ఐతే ఊహాగానాలకు చెక్ పెడుతూ.. మార్చి 19నే ‘టాక్సిక్’ను రిలీజ్ చేయడానికి టీం రెడీ అవుతోంది. ఇటీవల వరుస అప్‌డేట్లతో సినిమాను వార్తల్లో నిలబెడుతోంది చిత్ర బృందం.

‘టాక్సిక్’లో క్యారెక్టర్లను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నారు. ఐతే ఈ అప్‌డేట్స్ చూసి సినిమాలో ఇంతమంది హీరోయిన్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే గంగ పాత్రలో నయనతార, ఎలిజబెత్ క్యారెక్టర్లో హ్యూమా ఖురేషి, నదియాగా కియారా అద్వానీలను పరిచయం చేశారు. తాజాగా మెలిసా అనే క్యారెక్టర్లో రుక్మిణి వసంత్‌ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ భామ తారా సుతారియా కూడా నటిస్తోంది. ఏకంగా అయిదుగురు అందాల భామలు హీరోయిన్లుగా నటించడం అంటే విశేషమే.

వీరిలో అందరూ లీడ్ హీరోయిన్ రోల్ చేయగల స్థాయి ఉన్న వాళ్లే. ఇంతమంది హీరోయిన్లకు సినిమాలో ప్రధాన పాత్రలు ఇచ్చారంటే.. అవి ఎలా ఉంటాయి, ఈ కథలో వాటి ప్రాధాన్యత ఏంటి అనే క్యూరియాసిటీ కలుగుతోంది. మరి మలయాళ లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్.. ఈ పాత్రలను ఎలా డిజైన్ చేసిందన్నది ఆసక్తికరం. ‘దురంధర్-2’ లాంటి క్రేజీ మూవీ బరిలో ఉన్నప్పటికీ.. ‘టాక్సిక్’ను మార్చి 19నే రిలీజ్ చేయబోతున్నారంటే సినిమాపై ఎంతో ధీమాగా ఉన్నట్లే.