సినీ రంగంలో హీరో హీరోయిన్ల మధ్య డేటింగ్ రూమర్లు రావడం చాలా సహజం. బాలీవుడ్లో అయితే ఇలాంటి వార్తల్లో చిక్కుకోని ఆర్టిస్టులు అరుదు. పాపులారిటీ కోసం ఇలాంటి వార్తలను సృష్టించుకునే వాళ్లు కూడా అక్కడ ఉంటారు. సౌత్ ఇండియన్ సినిమాలో ఇలాంటివి కొంచెం తక్కువే అయినా.. వార్తలకేమీ లోటు ఉండదు. నిజంగా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్న సినీ జంటలను కూడా చూస్తున్నాం. ఈ జాబితాలోకి చేరబోతున్న కొత్త జంటగా సుశాంత్, మీనాక్షి చౌదరిల పేర్లు తెరపైకి వచ్చాయి ఇటీవల.
అక్కినేని కుటుంబ హీరో అయిన సుశాంత్.. మీనాక్షితో కలిసి ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఓ ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన ఆ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయింది. మీనాక్షికి తెలుగులో అదే తొలి సినిమా. అది ఆడకపోయినా.. తెలుగులో తనకు అవకాశాలకేమీ లోటు లేకపోయింది.
సుశాంత్ కెరీర్లో పెద్దగా ఎదుగుదల లేదు కానీ.. మీనాక్షి మాత్రం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిపోయింది. అయినా సరే.. తొలి సినిమా సమయంలో సుశాంత్‌తో మొదలైన పరిచయం ప్రేమగా మారిందని.. వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షికి ఈ వార్తల గురించి ప్రశ్న ఎదురైంది.
ఐతే ఆమె సింపుల్‌గా ఈ వార్తలను కొట్టిపారేసింది. సుశాంత్, తాను చాలా మంచి స్నేహితులమని.. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని మీనాక్షి స్పష్టం చేసింది. సినీ రంగంలో ఇలాంటి వార్తలు చాలా సహజమని.. వాటికి తాము అలవాటు పడిపోతుంటామని ఆమె అంది. ఈ వార్తలు చూసి తామిద్దరం నవ్వుకున్నట్లు మీనాక్షి తెలిపింది. సినీ రంగంలో మన గురించి మంచిగా, చెడుగా రెండు రకాలుగా మాట్లాడుకుంటారని.. కానీ ఎవరేమనుకుంటారో పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడమే తన ఫిలాసఫీ అని ఆమె చెప్పింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates