‘నా కూతురిని అతనే చంపేశాడు’

సినీ పరిశ్రమ 2020లో ఎన్నో విషాదాలు చూసింది. కరోనా కారణంగా, వేరే అనారోగ్యాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే కొందరు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఆత్మహత్యలకూ పాల్పడ్డారు. తాజాగా తమిళ టీవీ నటి, వీడియో జాకీ అయిన చిత్ర అర్ధంతరంగా తనువు చాలించడం అక్కడి వారిని విషాదంలో ముంచెత్తింది. ఈ ఉదంతం మీడియాలో సంచలనం రేపింది.

తనకు నచ్చిన వ్యక్తిని కొంత కాలం కిందటే రహస్యంగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నట్లు కనిపించిన చిత్ర ఇలా హఠాత్తుగా చనిపోతుందని అనుకోలేదని సన్నిహితులు అంటున్నారు. ఆమెది ఆత్మహత్యా హత్యా అనే విషయంలో స్పష్టత లేదు. ఒక షూటింగ్ కోసం తాను ఉంటున్న హోటల్ గదిలో విద్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా ప్రాథమికంగా తేలింది.

ఐతే విద్య ముఖం మీద, ఒంటి మీద గాయాలుండటంతో అనుమానాలు రేగాయి. తన కూతురిది ఆత్మహత్య కాదని, ఆమెను తన భర్త హేమంతే చంపేసి ఉంటాడని చిత్ర తల్లి ఆరోపించింది. ‘‘చిత్ర-హేమంత్ ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. కొన్ని నెలల కిందట రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఐతే తమ పెళ్లి గురించి అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడి అందరి సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది. నా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు అంతుబట్టడం లేదు. కానీ తన ముఖంపై, ఒంటిపై గాయాలున్నాయి. ఆమెను హేమంత్ కొట్టి చంపేసి ఉంటాడు. తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని నాటకం ఆడుతున్నాడు’’ అని చిత్ర తల్లి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు చిత్ర మృతిపై ఇంకా ఏమీ నిర్ధారించలేదు.