ఓవైపు థియేటర్లకు వచ్చే జనం సంఖ్య తగ్గిపోతోందనే ఆందొళన వ్యక్తమవుతూనే ఉంది. అదే సమయంలో ఇంకో వైపు థియేటర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రమాదంలో పడ్డప్పటికీ.. అన్ని ప్రధాన నగరాల్లోనూ కొత్త మల్టీప్లెక్సులు వస్తూనే ఉన్నాయి. దేశంలో సినిమా అభిమానం అత్యధికంగా ఉండే నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో కొత్త స్క్రీన్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
గత ఏడాది వనస్థలిపురంలో ఏషియన్ మూవీస్, రవితేజ కలయికలో ఆరు స్క్రీన్ల ఏఆర్‌టీ మల్టీప్లెక్స్‌ను మొదలుపెట్టగా దానికి మంచి స్పందన వస్తోంది. ఇంకా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏఎంబీ, ఐనాక్స్ మల్టీప్లెక్సులు రెడీ అవుతున్నాయి. ఎల్బీనగర్, హస్తినాపురం, కర్మాన్‌ఘాట్‌లోనూ మల్టీప్లెక్సులు నిర్మాణంలో ఉన్నాయి. ఈలోపే ఒక ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ సిటీలో ప్రారంభోత్సవం జరుపుకుంది. శనివారం కోకాపేటలో అల్లు సినిమాస్‌ను లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి నుండే ప్రారంభం కూడా కానుందట.
వనస్థలిపురంలోని ఏఆర్‌టీలో ఎపిక్ స్క్రీన్ ఎంత అప్లాజ్ తెచ్చుకుందో హైదరాబాద్ సినీ ప్రియులకు తెలుసు. క్రేజున్న సినిమాకు అందులో బుకింగ్స్ మొదలుపెడితే చాలు.. కాసేపటికే టికెట్లు అయిపోతున్నాయి. మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తోంది ఆ స్క్రీన్. ఇప్పుడు అల్లు సినిమాస్ పేరు మరింతగా మార్మోగడం ఖాయం. ఎందుకంటే అందులో ఒక స్పెషల్ స్క్రీన్ ఉంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ దాల్బీ స్క్రీన్ ఇందులో నిర్మాణం జరుపుకుంది.
75 అడుగుల దాల్బీ స్క్రీన్‌లో సినిమా చూడడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని సినీ పండితులు చెబుతున్నారు. హైదరాబాద్ సిటీకి ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని పీసీఎక్స్ ఎలా మణిహారంలా మారిందో.. అల్లు సినిమాస్‌లోని దాల్బీ స్క్రీన్ కూడా అంతే ఆకర్షణ కాబోతోందని అంటున్నారు. విజువల్‌గా గొప్పగా ఉండే ఈవెంట్ ఫిలిమ్స్‌ను ఈ స్క్రీన్లో చూస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుందట. సంక్రాంతి సినిమాలతోనే అల్లు సినిమాస్‌లో స్క్రీనింగ్ మొదలు కానుంది. ఈ నెల 9న రిలీజయ్యే రాజాసాబ్ ఇందులో ప్రదర్శితమయ్యే తొలి సినిమా కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates