పాన్ ఇండియా ప్రభాస్‌ను వాడుకునేది ఇలాగేనా…

ఈ మధ్యే ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో ప్రభాస్ పేరు ముందు ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ అంటూ ట్యాగ్ వేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అందులో అతిశయోక్తి ఏమీ లేదని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అంగీకరిస్తారు. ఇండియా మొత్తంలో ఇంత ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరో మరొకరు లేరు. ఇందులో బాహుబలి పాత్ర ఎంతో కీలకం. 

ఐతే ఆ సినిమా తర్వాత కూడా పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ చెక్కుచెదరకుండా చూసుకుంటున్నాడు ప్రభాస్. ‘సాహో’ సినిమా ఓవరాల్‌గా డిజాస్టర్ అయినా.. హిందీలో సూపర్ హిట్ కావడం విశేషం. ఆదిపురుష్ చిత్రానికి సైతం భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సలార్, కల్కి చిత్రాలు అక్కడ చాలా బాగా ఆడాయి. వాటికి నార్త్ ఇండియా ప్రమోషన్లు కూడా గట్టిగానే జరిగాయి. కానీ ‘రాజాసాబ్’ టీం మాత్రం ఈ విషయంలో వెనుకబడిందన్నది స్పష్టం.

సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ప్రభాస్ సినిమా రిలీజవుతోంది. పైగా హార్రర్ ఫాంటసీ కథలకు హిందీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఈ అడ్వాంటేజీని బాగా ఉపయోగించుకుని ‘రాజాసాబ్’కు భారీ కలెక్షన్లు తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటిదాకా నార్త్ ఇండియాలో ఒక్కటంటే ఒక్క ఈవెంట్ పెట్టలేదు ‘రాజాసాబ్’ టీం.

తెలుగులో ఏమీ ప్రమోషన్లకు ఢోకా లేదు. అసలిక్కడ పెద్దగా ప్రమోషన్లే అవసరం లేదు. ప్రభాస్ సినిమాలకు ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ ఈవెంట్లు పెట్టి అక్కడి మార్కెట్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల అవతల ఏ ఈవెంట్ ప్లాన్ చేయలేదు. 

ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్‌కు కీలకమైన ముంబయిలో ఒక్క ఈవెంటూ పెట్టకపోవడం ఏంటో? నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ ప్రమోషనల్ ఈవెంట్లకు బాగా ఖర్చు పెడతారనే పేరుంది. కానీ తన బేనర్లో తెరకెక్కిన తొలి ఫుల్ లెంగ్త్ పాన్ ఇండియా మూవీ రిలీజవుతుంటే.. ఆయన ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ మార్కెట్‌ను ఉపయోగించుకునేలా ఈవెంట్లు ఇప్పటిదాకా చేయకపోవడం ఆశ్చర్యం.

రిలీజ్ ముంగిట హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టడం కంటే.. కొంచెం ముందు నుంచే ఈవెంట్లు ప్లాన్ చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.